పుంజుకోని ధాన్యం కొనుగోళ్లు .. కొనుగోలు కేంద్రాల్లోనే వడ్ల కుప్పలు

  • హమాలీల సంఖ్య సరిపడా లేదు
  • సెంటర్లు ఓపెన్​ చేసి 26 రోజులు అయినా.. కొన్నది 75 వేల టన్నులు
  • 2.93 లక్షల ఎకరాల్లో పంట సాగు 
  • దిగుబడి అంచనా 5.25 లక్షల టన్నులు 

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఇంకా పుంజుకోలేదు. కొనుగోలు సెంటర్లలో ఎక్కడ పోసిన ధాన్యం కుప్పలు అక్కడే ఉన్నాయి. జిల్లాలో 2.93 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా సుమారు 5.25 లక్షల మెట్రిక్​టన్నుల వడ్ల దిగుబడి వస్తుందని అగ్రికల్చర్​ఆఫీసర్లు అంచనా వేశారు. సివిల్​ సప్లయ్​ ఆఫీసర్లు మాత్రం నాలుగు లక్షల టన్నులు కొనుగోలు చేయాలని టార్గెట్​గా పెట్టుకున్నారు. ఇందుకు తగ్గట్టుగా జిల్లాలో 323 కొనుగోలు సెంట్లర్లను ఓపెన్​ చేశారు. అయితే, సెంటర్లు ఓపెన్​ చేసి 25 రోజులు అయినా ఇప్పటివరకు 75 వేల మెట్రికల్​టన్నుల వడ్లు మాత్రమే కొనుగోలు చేశారు. 

హమాలీలతో సహా అన్ని సమస్యలే.. 

ధాన్యం కొనుగోలు కేంద్రాలతోపాటు రైస్​మిల్లుల్లో సమస్యలు తిష్టవేశారు. కొనుగోలు సెంటర్లకు కొత్తగా టార్ఫాలిన్లు రావడం లేదు. ఉన్న టార్పాలిన్లను సైతం రైతులకు సరిగా ఇవ్వడం లేదు. టార్పాలిన్లు కిరాయికి తీసుకుంటే రోజుకు రూ.30 తీసుకుంటున్నారు. కొన్ని సెంటర్లలో వడ్లను తూర్పార పట్టే మిషన్లు సరిగా లేవు. వాటిని కిరాయికి తీసుకొస్తే గంటకు రూ.వెయ్యి తీసుకుంటున్నారు. 

కొనుగోలు సెంటర్లలో కాంటా పెట్టడమే గగనంగా మారింది. జిల్లాలో 40 సీఎంఆర్​మిల్లులు ఉండగా, వాటిల్లో సగం మిల్లుల్లో హమాలీ కొరత ఉంది. బీహార్, ఒడిశా సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హమాలీలు ఇటీవల స్వరాష్ట్రాలకు వెళ్లిపోయారు. దీంతో కాంటా పెట్టిన వడ్ల సంచులను మిల్లులకు తీసుకెళ్లిన లారీలను అన్​లోడ్​చేయడానికి హమాలీల సంఖ్య సరిపడా లేదు. దీంతో వెళ్లిన లారీలు వెళ్లినట్టే మిల్లుల్లోనే ఉంటున్నాయి. వెళ్లిన లారీ తిరిగి రావడానికి రోజుల సమయం పడుతోంది. ఈ కారణంగా సెంటర్లలో వడ్ల కుప్పలు పేరుకుపోయాయి. 

ఆకాశంలో మబ్బులు.. అన్నదాతల్లో ఆందోళన.. 

ఈ సీజన్​లో వడగండ్ల వానలు పడుతూ ఉంటాయి. జిల్లాలో రికార్డు స్థాయిలో ఎండలు కొడుతున్నాయి. సాయంత్రం కాగానే జిల్లాలో ఎక్కడో చోట ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకుంటున్నాయి. దీంతో ఎక్కడ వానలు పడతాయోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గడిచిన వారంలో రాజాపేట, మోత్కూరు, ఆత్మకూర్​(ఎం), రామన్నపేట మండలాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. దీంతో పలుచోట్ల సెంటర్లలోని వడ్లు తడిచిపోయాయి.