- ఇప్పటికే 10,851 మందికి పదోన్నతలు పూర్తి
- చరిత్రలో ఎన్నడూ లేనంతగా టీచర్లకు ప్రమోషన్లు
- చట్టపరమైన వివాదాలను పరిష్కరించి ఉపాధ్యాయులకు న్యాయం చేసిన సర్కారు
రాష్ట్రంలో టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. మల్టీ జోన్1, 2లో కలిపి 10,851 మంది టీచర్లు ఇప్పటికే ప్రమోషన్లు పొందారు. మల్టీ జోన్ 2లో మరో 8 వేల మందికి ఈ నెలాఖరు నాటికి ప్రమోషన్లు ఇవ్వడంతో పాటు బదిలీలను పూర్తిచేయనున్నారు.
హైదరాబాద్, వెలుగు: రెండు దశాబ్దాలుగా సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ), భాషా పండితులు (ఎల్పీ), ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు (పీఈటీ) ఎదురుచూస్తున్న ప్రమోషన్ల కలను నెరవేర్చింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా పెద్ద సంఖ్యలో ప్రమోషన్లను కల్పించింది. ప్రమోషన్లకు అడ్డుగా ఉన్న హైకోర్టు, సుప్రీంకోర్టుల్లోని చట్టపరమైన సమస్యలను పరిష్కరించి పదోన్నతులకు మార్గం సుగమం చేసింది. ఫలితంగా 8,630 మంది భాషా పండితులు, 1,849 మంది పీఈటీలు ప్రమోషన్లు పొంది కొత్త చోట పోస్టింగులు దక్కించుకున్నారు. మల్టీజోన్1, 2ల్లో కలిపి 10,851 మంది టీచర్లు ప్రమోషన్లు పొందారు. వారందరికీ ఆన్లైన్లో పూర్తి పారదర్శకతతో సర్కారు ప్రమోషన్లు ఇచ్చింది. మల్టీజోన్ 2లో మరో 8 వేల మందికి ఈ నెలాఖరు (జూన్ 30) నాటికి ప్రమోషన్లు ఇవ్వడంతో పాటు బదిలీలను పూర్తి చేయనుంది. కాగా, గత ప్రభుత్వ హయాంలోనే భాషా పండితులు, పీఈటీల పదోన్నతులకు ఉత్తర్వులు సిద్ధమైనా.. కోర్టుల్లో పలు కేసులు పెండింగ్లో ఉండడంతో ఉత్తర్వులను జారీ చేయలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టారు. చట్టపరంగా ఉన్న అడ్డంకులను అధిగమించేలా కృషి చేశారు. ఫలితంగా టీచర్ల ప్రమోషన్లకు బాటలు పడినట్టయింది. ఉపాధ్యాయుల అర్హతకు తగ్గట్టు ప్రమోషన్లు దక్కడంతో ప్రభుత్వ, స్థానిక సంస్థల పరిధిలోని స్కూళ్లలో విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన జరగనుంది.
మల్టీ జోన్2లో స్కూల్ అసిస్టెంట్లకు హెడ్మాస్టర్లుగా ప్రమోషన్లు
జిల్లా ప్రమోషన్ల సంఖ్య
ఆదిలాబాద్ 445
కుమ్రం భీం ఆసిఫాబాద్ 340
మంచిర్యాల 458
నిర్మల్ 416
నిజామాబాద్ 833
జగిత్యాల 682
పెద్దపల్లి 368
జయశంకర్ భూపాలపల్లి 27
భద్రాద్రి కొత్తగూడెం 694
మహబూబాబాద్ 517
వరంగల్ 434
హనుమకొండ 475
కరీంనగర్ 504
రాజన్న సిరిసిల్ల 394
కామారెడ్డి 787
మెదక్ 597
సిద్దిపేట 679
ఖమ్మం 954
ములుగు 229
మొత్తం 10,083