గృహలక్ష్మి అనర్హులు.. 25 శాతానికి పైనే!

  • పూర్తి కావొచ్చిన ఆన్‌‌లైన్ అప్‌‌లోడ్ ప్రక్రియ 
  • ఉమ్మడి జిల్లాలో1,74,823 అప్లికేషన్లు
  • ఇప్పటి వరకు 45,380 దరఖాస్తులు తిరస్కరణ

యాదాద్రి, వెలుగు: గృహలక్ష్మి పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి కావొస్తోంది. అధికారులు అర్హులను గుర్తించి ఆన్‌‌లైన్‌‌లో అప్‌‌లోడ్‌‌ చేస్తున్నారు.  ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,74,823 మంది మహిళలు అప్లికేషన్లు పెట్టుకోగా..  45,380 తిరస్కరణకు గురయ్యాయి. ఇంకొన్ని దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. ఇప్పటి వరకు తిరస్కరించిన అప్లికేషన్లే 25 శాతానికి పైగా ఉండడం గమనార్హం. ఎంపిక చేసిన లబ్ధిదారులకు స్కీమ్ గ్రౌండ్‌‌ చేయాలంటే నాలుగు నెలల టైం పట్టనుందని అధికారులు చెబుతున్నారు. 

ముందు మూడు రోజులే అని చెప్పి.. 

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రభుత్వం గత నెలలో గృహలక్ష్మి స్కీమ్‌‌ అమలు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంటి జాగా ఉన్నవారికి ఇల్లు కట్టుకునేందుకు రూ. 3 లక్షలు  ఇస్తామని చెప్పి.. అప్లై చేసుకోవడానికి మూడంటే మూడే రోజులే అవకాశమిచ్చింది.  దీంతో మహిళలు ‘మీసేవ’ల వద్దకు పరుగులు పెట్టారు. అయితే మూడు రోజుల టైంపై విమర్శలు రావడంతో ఒక్కో నియోజకవర్గానికి  3 వేల మందికే ఇస్తామని చెప్పడంతో పాటు స్కీమ్​ నిరంతరంగా కంటిన్యూ చేస్తామని సర్కారు ప్రకటించింది. 

యాదాద్రిలో ,39 శాతం అనర్హులు

యాదాద్రి జిల్లాలో 34,451 మంది అప్లయ్​ చేసుకోగా..  వెరిఫికేషన్​ చేసేందుకు జిల్లా యంత్రాంగం 87 టీములను నియమించి సర్వే చేయించింది.  ఈ సర్వేలో 21,291 మంది (61 శాతం) అర్హులుగా, 13,160 మంది(39 శాతం)ని అనర్హులుగా గుర్తించారు. లిస్ట్‌‌ రెడీ చేయడంతో పాటు ఆన్​లైన్​లో​ అప్​లోడ్​ ప్రక్రియ ముగించారు.  సూర్యాపేట జిల్లాలో 61482 మంది అప్లై చేసుకోగా.. 46982 అర్హులు గుర్తించి 14220 అప్లికేసన్లు(23 శాతం) తిరస్కరించారు.  నల్గొండ జిల్లాలో 78,890 దరఖాస్తులు రాగా.. 77,500 పరిశీలించి 59,500 మంది అర్హులుగా గుర్తించి.. 18,000 మందిని అనర్హులుగా తేల్చారు.  మరో 1390 అప్లికేషన్లు పరిశీలనలో ఉన్నాయి.  కాగా సర్వే జరుగుతున్న సమయంలోనే అధికార పార్టీకి చెందిన కొందరు లీడర్లు తమకు కావాల్సిన వారిని అర్హులుగా గుర్తించాలని అధికారులపై ఒత్తిడి చేసినట్టుగా తెలిసింది.