భద్రాచలం,వెలుగు: చేతి వృత్తిదారులకు రూ. లక్ష ఆర్థిక సాయం అందించేందుకు స్వీకరించిన అప్లికేషన్ల వెరిఫికేషన్ ప్రక్రియ వెరీ స్లోగా సాగుతోంది. ఈనెల 15నే చెక్కులు కూడా అందిస్తామని సర్కారు ప్రకటించింది. ఒక్కో నియోజకవర్గానికి 12 వందల నుంచి 15వందల మందికి ఈ సాయం అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కానీ ఫీల్డ్ లెవల్లో అప్లికేషన్ల వెరిఫికేషన్ ఒక కొలిక్కి రాలేదు. 13,657 మంది బీసీలు ఆన్లైన్ లో అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఎంపీడీవో ఆఫీసు సిబ్బంది ఇంటింటికి వెళ్లి వారి వివరాలు, ఆర్థిక పరిస్థితులు పరిశీలించాలి. ఈనెల 6 వరకు భద్రాచలం నుంచి వెరిఫికేషన్ పూర్తి చేసి అర్హుల వివరాలు భద్రాద్రి కొత్తగూడెం బీసీ వెల్ఫేర్ ఈడీ ఆఫీసుకు పంపాలి. కానీ ఆ ప్రక్రియ పూర్తి కాలేదు.
భద్రాచలంలో 869 అప్లికేషన్లు.. వెరిఫికేషన్ పూర్తయింది 13
భద్రాచలం టౌన్లో 869 మంది బీసీలు రూ.లక్ష ఆర్థిక సాయం కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వీరంతా అప్లికేషన్లు ఎంపీడీవో ఆఫీసులో అందజేశారు. వీటిని వెరిఫికేషన్ చేసేందుకు మూడు టీంలను ఏర్పాటు చేశారు. ఈనెల 6 వరకు ఒక్కరినీ కూడా ఎంపిక చేయలేదు. అప్లికేషన్ పెట్టుకున్న లబ్దిదారుడు నిజంగానే చేతివృత్తి పనిచేస్తున్నాడా..? అతని ఆర్థిక పరిస్థితి ఏమిటీ..? వివరాలు సేకరించాక క్యాస్ట్ , ఇన్‌కం, రేషన్, ఆధార్ కార్డుల తనిఖీ నిర్వహిస్తారు. సోమవారం నాటికి కేవలం 13 మందిని మాత్రమే ఎంపిక చేసి జిల్లా కేంద్రానికి పంపించారు. 13,657 మంది అప్లికేషన్లు పెట్టుకుంటే కేవలం 3,880 మంది అర్హుల లిస్టు మాత్రమే ఈనెల 6 నాటికి ఆఫీసర్ల చేతికి చేరింది.
బేరసారాలు
మరోవైపు బెనిఫిషర్ల లిస్టు ఫైనల్చేసే క్రమంలో అప్లికేషన్ల వెరిఫికేషనప్పుడు బేరసారాలు జరుపుతున్నారు. భద్రాచలంలో పలు వార్డుల్లో పైసలిస్తే ఎలిజబుల్ లిస్టులో మీ పేరు పెడతామంటూ వెరిఫికేషన్ చేసే టీం మభ్య పెడుతోంది. జిల్లా వ్యాప్తంగా ఇదే తీరుగా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దళితబంధు స్కీంలో కమీషన్ల బాగోతం సర్కారును కుదిపేసింది. ఇప్పుడు బీసీలకు ఇచ్చే రూ. లక్ష ఆర్థిక సాయంలో కూడా కమీషన్ల ఆరోపణలు రావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిష్పక్షపాతంగా జరగాలి
అప్లికేషన్ల వెరిఫికేషన్ నిష్పక్షపాతంగా జరగాలి. చేతివృత్తిదారుల నుంచి కమీషన్లు ఆశించడం తగదు. వెరిఫికేషన్ కూడా స్పీడ్‌గా చేయాలి. లేకపోతే ప్రభుత్వ సాయం దూరమయ్యే ప్రమాదం ఉంది.
ఆకోజు సునీల్‌కుమార్, సీపీఐ టౌన్ సెక్రటరీ, భద్రాచలం
స్పీడ్ పెంచినం
అప్లికేషన్ల వెరిఫికేషన్ స్పీడ్ పెంచినం. కొన్ని మండలాల్లో స్లోగా ఉన్న మాట వాస్తవమే. కలెక్టర్ ఆర్థిక సాయం పథకంపై నిత్యం రివ్యూలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు 7వేల మంది అర్హుల వివరాలు వచ్చాయి. మరో 2వేలు రిజెక్ట్ అయ్యాయి. మిగిలినవి కూడా త్వరలోనే వెరిఫికేషన్ పూర్తి చేస్తాం. బెనిఫిషర్ల తుది జాబితా సిద్ధం అవుతుంది.
ఇందిర, ఈడీ, బీసీ కార్పోరేషన్, భద్రాద్రికొత్తగూడెం