సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం

సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం

హైదరాబాద్: కొత్త రేషన్ కార్డుల జారీపై కేబినెట్ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని కేబినెట్ సమావేశంలో చర్చించిన అనంతరం ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో గత దశాబ్ద కాలంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. 

రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని సర్కారు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రేషన్ కార్డు అర్హతలు, విధివిధానాలు, వార్షిక ఆదాయ పరిమితిపై మంత్రివర్గ ఉప సంఘం ఇప్పటికే చర్చించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం అమలు చేసే వివిధ పథకాలు రేషన్​కార్డుతో ముడిపడి ఉన్నవే. తెల్ల రేషన్​కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలు పొందడానికి అర్హులు అవుతారు. దీంతో చాలా మంది రేషన్​ కార్డుల కోసం నిరీక్షిస్తున్నారు.

పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్​ సర్కారు.. కొత్త రేషన్​ కార్డులు ఇవ్వడంపై దృష్టి పెట్టలేదు. 2018 ముందస్తు ఎన్నికల సమయంలో రేషన్​ కార్డులు ఇస్తామని ప్రకటించి అప్లికేషన్లు ఆహ్వానించింది. దీంతో అప్పట్లో పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. అయితే, 2021 నాటికి కొందరికి మాత్రం ఆహార భద్రత కార్డులు మంజూరు చేసింది. ఆ తర్వాత పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. కుటుంబాలు, కుటుంబ సభ్యులు పెరుగుతున్నా.. కార్డులు జారీ చేయలేదు. చనిపోయినవారి పేర్లను జాబితా నుంచి తొలగించారే కానీ కొత్తగా వారిని చేర్చలేదు. దీంతో పలు సంక్షేమ పథకాల విషయంలో అర్హులైన అనేక మందికి లబ్ధి చేకూరలేదు.

ALSO READ | ఏ బాంబు పేలుతుందో కేటీఆర్కు త్వరలో తెలుస్తుంది: మంత్రి పొంగులేటి

ప్రజా పాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ 28, 2023 నుంచి జనవరి 6, 2024 మధ్య అప్లికేషన్లను స్వీకరించింది. అయితే ఆరు గ్యారంటీల కంటే కూడా రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రేషన్ కార్డుల జారీపై కాంగ్రెస్​ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఆరు గ్యారంటీలతో పాటు ఇతర సంక్షేమ పథకాలకు రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకోవడంతో ప్రజల నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలన్న డిమాండ్ పెరగడంతో అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులను ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రేషన్ కార్డుల పంపిణీకి కేబినెట్​కూడా నిర్ణయం తీసుకుంది. రేవంత్ సర్కార్ చూపుతున్న చొరవతో.. కొత్త రేషన్ కార్డుల కోసం ఏండ్ల తరబడి ఎదురు చూస్తున్న వారి నిరీక్షణకు తెరపడనుంది.