- ప్రాజెక్టుల్లో ఎదురైన సవాళ్లు, పరిష్కారాలను వివరిస్తూ సీనియర్ల పాఠాలు
- అవన్నీ పాడ్‌కాస్ట్ చేసి యూట్యూబ్ చానెల్లో అప్లోడ్ చేయనున్న డిపార్ట్మెంట్
హైదరాబాద్, వెలుగు: భారీ ప్రాజెక్టులు, బ్యారేజీలు కడుతున్నప్పుడు ఒక్కోసారి అనుకోని పరిణామాలు ఎదురవుతుంటాయి. వాటిని ఎదుర్కోవడం, అలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదే! అందుకే జూనియర్ఆఫీసర్లకు అలాంటి వాటిపై అవగాహన కల్పించేందుకు ప్రాక్టికల్ నాలెడ్జ్సెషన్స్ నిర్వహించాలని ఇరిగేషన్డిపార్ట్మెంట్ నిర్ణయించింది. అందుకోసం ఓ ‘టెక్నికల్ క్లబ్’ను ఏర్పాటు చేసింది.
హైదరాబాద్ జలసౌధలో ఏర్పాటు చేసిన ఈ టెక్నికల్క్లబ్లో జూనియర్ ఆఫీసర్లందరికీ సీనియర్ ఇంజనీరింగ్ అధికారులు వారికి ఎదురైన అనుభవాలను వివరించనున్నారు. వారు ఫీల్డ్‌లో ఉన్నప్పుడు ఎదురైన సవాళ్లు, వాటి పరిష్కరించిన తీరు, అకస్మాత్తుగా ఏదైనా జరిగితే ఎలా స్పందించాలి? తదితర విషయాలను కొత్తగా జాయిన్అయిన ఏఈఈలు, ఇతర జూనియర్ అధికారులకు వివరించనున్నారు. ఇలా సీనియర్ అధికారులు చెప్పే అనుభవాలను పాడ్కాస్ట్చేయనున్నారు. అందుకోసం ఓ యూట్యూబ్ చానల్ కూడా ప్రారంభించనున్నారు.
కాళేశ్వరం సహా పలు ప్రాజెక్టులు ఉదాహరణగా..
టెక్నికల్క్లబ్ద్వారా గతంలో ప్రాజెక్టులు నిర్మించేటప్పుడు, వాటి నిర్వహణలో తలెత్తిన టెక్నికల్ సమస్యలు, అంశాలపై జూనియర్అధికారులకు సీనియర్లు వివరించనున్నారు. ఉదాహరణకు ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కన్నెపల్లి పంప్హౌస్మునక, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో లీకేజీలు, వట్టెం పంప్‌హౌస్ మునక వంటి అంశాల గురించి జూనియర్ అధికారులకు ఉదాహరణగా వివరించనున్నారు. ఆయా సందర్భాల్లో ఫీల్డ్ఇంజనీర్లు, సీనియర్ అధికారులకు ఎదురైనా సమస్యలేంటో? వాటిని ఎలా పరిష్కరించారో? మున్ముందు అలాంటివి జరగకుండా ఏం చేయాలి? తదితర అంశాలను ఈఎన్సీల నుంచి సీనియర్ ఇంజనీరింగ్ అధికారుల వరకు జూనియర్లకు వివరించనున్నారు. అంతేగాకుండా ప్రాజెక్టులను కట్టాలనుకున్నప్పుడు జరిగే ప్రాసెస్, డీపీఆర్‌ల ప్రిపరేషన్, ఇతర సాంకేతిక అంశాలపై అవగాహన కల్పిస్తారు. వారంలో ఒక రోజు ఈ నాలెడ్జ్ సెషన్‌కు కేటాయించనున్నట్టు తెలిసింది. ఒక్కో అధికారి చెప్పిన అంశాలన్నింటినీ పాడ్‌కాస్ట్ చేసి, డిపార్ట్మెంట్ తరఫున ప్రారంభించనున్న యూట్యూబ్చానెల్లో అప్ లోడ్ చేయనున్నారు.
కొత్త వారికి ఎంతో మేలు..
ఈ టెక్నికల్ క్లబ్‌తో కొత్తగా డిపార్ట్మెంట్లో చేరే ఇంజనీర్లకు ఎంతో ఉపయోగం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి కొత్తగా చేరిన ఏఈఈలు అందరూ ఫీల్డ్‌లో ఉండాల్సిందేనని సర్కారు ఇప్పటికే తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఫీల్డ్‌లో ఉండి పనిచేసే ఏఈఈలకు ఈ టెక్నికల్నాలెడ్జ్ సెషన్స్‌తో చాలా విషయాలు తెలుస్తాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. శిక్షణలో తెలుసుకునే విషయాలతో పాటు సీనియర్అధికారుల అనుభవాలూ తెలిస్తే భవిష్యత్‌లో ఎలా రెస్పాండ్ అవ్వాలో నేర్చుకునేందుకు వీలుంటుందని చెబుతున్నారు.