ఆసిఫాబాద్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు వెరీ స్లో

  • జిల్లాలో సగానికిపైగా కొనుగోలు సెంటర్లు ఓపెన్ కాలే
  • 37 కొనుగోలు సెంటర్లలో 18 మాత్రమే ఓపెన్
  • అకాల వర్షాలతో భయం గుప్పిట అన్నదాత
  • ధాన్యం కుప్పల వద్ద నిరీక్షణ

ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు స్లోగా సాగుతున్నాయి. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందునే అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు. దళారీ వ్యవస్థకు స్వస్తి పలికి నేరుగా రైతుల నుంచి ధాన్యం సేకరించేందుకు ప్రభుత్వం ఆయా మండలాల్లో పీఏసీఎస్, ఐకేపీ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. కానీ కొన్ని చోట్ల ఇంకా కొనుగోలు కేంద్రాలు ఓపెన్​కూడా చేయలేదు. వర్షాకాలం దగ్గర పడుతున్నా పూర్తిస్థాయిలో సెంటర్లు ఓపెన్ చేయడంలో ఆఫీసర్లు నిరక్ష్యం చేస్తున్నారు. 

చేతికొచ్చిన పంటను రైతులు పొలాలు, ఇండ్లు, కొనుగోలు కేంద్రాల వద్ద ఉంచుతూ తమ వంతు ఎప్పుడు వస్తుందా అని రోజుల తరబడి ఎదరుచూస్తున్నారు. తేమ పేరుతోనూ అధికారులు కాలయాపన చేస్తుండడంతో.. ఇదే అదునుగా భావించి దళారులు రంగప్రవేశం చేస్తున్నారు. రైతులకు మాయ మాటలు చెప్పి గవర్నమెంట్ ప్రకటించిన మద్దతు ధర కంటే తక్కువ చెల్లిస్తూ ఇండ్ల వద్దనే కొంటూ వారిని నిలువు దోపిడీ చేస్తున్నారు. 

ఇప్పటివరకు 3,800 మెట్రిక్ టన్నులు మాత్రమే..

జిల్లాలో ఈసారి వరి 55,394 ఎకరాల్లో సాగు చేశారు. అన్ని చోట్లా వరి కోతలు పూర్తయ్యాయి. ఈసారి 48 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ధాన్యాన్ని కొనేందుకు జిల్లా వ్యాప్తంగా 37 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. 18 సెంటర్లు మాత్రమే ఓపెన్ చేసి తూతూ మంత్రంగా కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటివరకు 520 మంది రైతుల దగ్గర నుంచి కేవలం 3,800 మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారు. ప్రభుత్వం మద్దతు ధర ఏ గ్రేడ్ రకానికి 2,203, సాధారణ రకానికి 2,183 నిర్ణయించగా అమ్మిన రైతులకు రూ.70 లక్షలు చెల్లించారు. 

సుమారు రూ.5 కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో వడ్ల కొనుగోలు జరగలేదు. ఒక్కో సెంటర్​లో కనీసం ఒక లారీ వడ్లు కూడా కొని మిల్లుకి తరలించలేదని తెలుస్తోంది. కౌటాల మండలంలోని వీరవెళ్లి ఐకేపీ సెంటర్​లో 20 వేల బస్తాల వడ్ల కొనుగోలుకు టార్గెట్ పెట్టుకున్నారు. ఇక్కడ రైతులు 15 రోజుల కిందటే పొలాలు కోసి వడ్లను ఆరబెట్టారు. కానీ కొనుగోళ్లు సరిగా జరగడంలేదు. ఇప్పటివరకు కేవలం ఒక లారీ మాత్రమే మిల్లుకు చేరింది. తేమ ఎక్కువగా ఉందని, ఆరబెట్టిన తర్వాతే జోకుతామని సెంటర్ నిర్వాహకులు చెబుతున్నారు. 

ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలకు రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం వడ్ల కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసినా సెంటర్​ నిర్వాహకులు పట్టించుకోవడం లేదని.. ఇంత స్లోగా కొనుగోళ్లు చేస్తే తమ ధాన్యాన్ని ఎప్పుడు కొంటారని, వర్షం వస్తే నిండా మునిగిపోతామని ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా కొనుగోళ్లలో వేగం పెంచాలని వేడుకుంటున్నారు.

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తం

జిల్లాలో 37 కొనుగోలు సెంటర్లకు గానూ ప్రస్తుతం 18 సెంటర్లలో కొనుగోలు చేస్తున్నం. రైతుల వద్ద ఉన్న ప్రతి గింజనూ కొనుగోలు చేస్తం. వర్షానికి తడిసినా ఆందోళన చెందవద్దు. కొనుగోళ్లను వేగవంతం చేస్తం. పేమెంట్ కూడా ఎప్పటికప్పుడు గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. రైతులు ఆందోళన చెందవద్దు.

వినోద్, డీఎస్ఓ, ఆసిఫాబాద్

నాలుగెకరాల ధాన్యాన్ని 10 రోజుల నుంచి ఆరబెడుతున్నా..

4 ఎకరాలల్లో పండిన వడ్లను 15 రోజుల క్రితం కోశాను. సుమారు 120 బస్తాల వడ్లు కుప్ప పోసి పెట్టిన. అధికారులు వడ్లను చూసి తేమ ఎక్కువ ఉందని, ఇంకా ఆరబెట్టాలని చెబుతున్నారు. వర్షం భయంతో రోజూ పొద్దున నుంచి సాయంత్రం దాకా కుప్పల దగ్గర కావలి ఉండి, టార్పాలిన్లు కప్పుతున్నా. జల్దిన వడ్లు కాంటా అయ్యేలా సర్కారు చూడాలె.

చూనర్కార్ విఠల్, రైతు, వీరవెళ్లి, కౌటాల