- సేకరించింది 2.18 లక్షల క్వింటాళ్లు
- వాటి విలువ రూ.69.37 కోట్లు
- ఇంకా ఇవ్వాల్సింది రూ.39.36 కోట్లు
సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో జొన్నల కొనుగోళ్లు ఎట్టకేలకు ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 30,400 ఎకరాల్లో యాసంగిలో జొన్న పంట సాగు చేశారు. ఏప్రిల్ రెండో వారంలో మొదలైన జొన్నల కొనుగోళ్ల ప్రక్రియ అనేక ఒడిదుడుకుల మధ్య అధికారులు పూర్తి చేశారు. మొత్తం19 కేంద్రాలు ఏర్పాటు చేయగా 2.18 లక్షల క్వింటాళ్ల జొన్నలను కొనుగోలు చేసినట్టు మార్క్ ఫెడ్ అధికారులు తెలిపారు. సేకరించిన ధాన్యం విలువ రూ. 69.37 కోట్లు కాగా ఇంకా రూ.39.36 కోట్ల చెల్లింపులు చేయాల్సి ఉంది. సేకరించిన ధాన్యాన్ని గోదాములకు తరలించకుండా చాలా చోట్ల ఇంకా కొనుగోలు కేంద్రాల్లోనే ఉంచారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
2.18 లక్షల క్వింటాళ్లు..
జిల్లాలో మొత్తం 11,068 మంది రైతుల నుంచి 2,18,152 క్వింటాళ్ల జొన్నలు కొనుగోలు చేశారు. ఓవరాల్ గా జిల్లాలో 30,400 ఎకరాల్లో జొన్న పంట సాగు చేశారు. మద్దతు ధర క్వింటాలుకు రూ.3,180 ప్రభుత్వం నిర్ణయించింది. డీసీఎంఎస్, ఐకేపీ ద్వారా మొత్తం రూ.69.37 విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో 1,82,372 క్వింటాళ్ల జొన్నలను గోదాములకు తరలించగా ఇంకా 35,780 క్వింటాళ్ల జొన్నలను కొనుగోలు కేంద్రాల వద్ద ఉంచినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు 6,013 మంది రైతుల ఖాతాల్లో రూ.30.01 కోట్ల బకాయిలు జమ చేసినట్టు మార్క్ఫెడ్అధికారులు వెల్లడించారు.
రంగు మార్పు పేరుతో రివర్స్..
కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం రంగు మారిందన్న పేరుతో రైతులను మోసం చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాయికోడ్, నాగల్ గిద్ద, సదాశివపేట, మార్డి, జరా సంఘం, ఏడాకులపల్లి, కల్హేర్ కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోల్లపై గొడవలు జరిగాయి. కొనుగోలు టైంలో రంగు మారని ధాన్యం గోదాముకు తీసుకెళ్లి 20 రోజుల తర్వాత మళ్లీ కొనుగోలు కేంద్రానికి వెనక్కి తీసుకొచ్చి రంగు మారిందని రైతులకు వాపస్ ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. .
రాయికోడ్ మండలం అల్లాపూర్ రైతులు ఉసిరికెపల్లి సతీశ్, సరస్వతి 23.50 క్వింటాళ్ల జొన్నలు కొనుగోలు కేంద్రంలో విక్రయించగా, సహకార సంఘం అధికారులు 20 రోజుల తర్వాత వారి జొన్నలు రంగు మారాయంటూ మార్కెట్ యార్డ్ వరండాలో పారేసి పోయినట్టు సమాచారం. దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు.