హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల కమిటీతో తెలుగు సినిమా ఇండస్ట్రీ చర్చలు ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత జరిగిన భేటీకి.. నిర్మాతల నుంచి హీరో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా హాజరయ్యారు. ఈ భేటీలో అల్లు అరవింద్ స్పీచ్ ఇలా ఉంది.
Also Read:-చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు.. నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలు..
సీఎం రేవంత్తో భేటీలో అల్లు అరవింద్ వ్యాఖ్యలివి:
* తెలుగు నిర్మాతలకు ఈరోజు శుభదినం
* ప్రభుత్వాన్ని కలిసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు
* సంధ్య థియేటర్ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం
*హైదరాబాద్ వరల్డ్ షూటింగ్ డెస్టినేషన్ కావడానికి ప్రభుత్వానికి సహకరిస్తాం
అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జున్ తాజా సినిమా పుష్ప–2 ప్రీమియర్ షోలు డిసెంబర్ 4నే రాత్రి 9.30కి పడ్డాయి. పుష్ప–2 ప్రీమియర్ షోను అభిమానులతో కలిసి వీక్షించేందుకు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్న సంధ్య థియేటర్కు అల్లు అర్జున్ వెళ్లాడు. బన్నీని చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ అభిమానుల కాళ్ల కింద పడి నలిగిపోయింది. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. రేవతి కొడుకు శ్రీతేజ్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.
పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి రూ.2 కోట్ల ఆర్థిసాయాన్ని అందిస్తున్నట్లు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ తెలిపారు. ఇందులో అల్లు అర్జున్ తరపున కోటి రూపాయలు, పుష్ప-2 సినీ నిర్మాతలు మైత్రి మూవీస్ తరఫున రూ.50 లక్షలు, దర్శకుడు సుకుమార్ తరఫున రూ.50 లక్షలు ఉన్నాయని తెలిపారు. మొత్తంగా రూ. 2 కోట్ల చెక్కును ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న ఎఫ్డీసీ చైర్మన్ దిల్‌రాజుకు అందజేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
దిల్ రాజు, పుష్ప2 నిర్మాతలతో కలిసి బుధవారం అల్లు అరవింద్ సికింద్రాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్‌కు వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించారు. అనంతరం అరవింద్ మీడియాతో మాట్లాడారు. శ్రీతేజ్ ఆరోగ్యం నెమ్మదిగా మెరుగుపడుతున్నదని.. వెంటిలేటర్ తీసేసి 72 గంటలు గడిచిందని డాక్టర్లు చెప్పారని అన్నారు. ఆ బాలుడు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.