25 ఏళ్ల ప్రయాణంలో 38 సినిమాలు చేశా.. ఫుల్ హ్యాపీగా ఉన్నా: బెల్లంకొండ సురేష్

25 ఏళ్ల ప్రయాణంలో 38 సినిమాలు చేశా.. ఫుల్ హ్యాపీగా ఉన్నా: బెల్లంకొండ సురేష్

శ్రీహరి హీరోగా వచ్చిన ‘సాంబయ్య’ చిత్రంతో నిర్మాతగా కెరీర్‌‌‌‌ ప్రారంభించిన బెల్లంకొండ సురేష్.. ఈ ఏడాదితో పాతికేళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్నారు. గురువారం ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన సినీ జర్నీ గురించి, కొత్త చిత్రాల గురించి ఆయన ఇలా ముచ్చటించారు.‘‘25 ఏళ్ల ప్రయాణంలో 38 సినిమాలు చేశాను. నిర్మాతగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నా. 

అలాగే నా ఇద్దరు కొడుకులు హీరోలుగా రాణిస్తున్నారు. వండర్‌‌‌‌ఫుల్ జర్నీ. ఫుల్‌‌ హ్యాపీగా ఉన్నా. అయితే ‘సాంబయ్య’తో నిర్మాతగా నాకు తొలి అవకాశం ఇచ్చిన శ్రీహరి గారు మన మధ్య లేకపోవడం బాధాకరం. ఆయన మంచి నటుడే కాదు గొప్ప వ్యక్తి కూడా.  ఇక నాకిది 57వ బర్త్‌‌ డే.  ‘గంగ’ (2015) తర్వాత సినిమా చేయలేదు. పిల్లల కెరీర్‌‌‌‌ కోసమే 9 ఏళ్లు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది.  ఏప్రిల్ నుంచి మళ్ళీ సినిమాలు స్టార్ట్ చేస్తున్నా. ఇప్పటికే పెద్దబ్బాయి సాయి శ్రీనివాస్ కెరీర్‌‌‌‌ సెట్ అయ్యింది.  ప్రస్తుతం నాలుగు ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. టైసన్ నాయుడు, సాహూతో  సినిమాలు జరుగుతున్నాయి.

 ‘గరుడన్’ రీమేక్‌‌ను క్రిస్మస్‌‌ రిలీజ్‌‌కి ప్లాన్ చేస్తున్నాం.  కోడిరామకృష్ణ గారి అల్లుడు నిర్మాణంలో చేస్తున్న సినిమా మ్యాసీవ్ బడ్జెట్ ఫిల్మ్. సీజీ వర్క్ ఎక్కువ ఉన్న సినిమా కావడంతో ఓపికగా చేస్తున్నారు. చిన్నబ్బాయి గణేష్‌‌ ఇప్పుడిప్పుడే కెరీర్‌‌‌‌ సెట్ చేసుకుంటున్నాడు. తనకు రెండు కొత్త ప్రాజెక్ట్స్ ఉన్నాయి.  ఏప్రిల్‌‌లో ఇద్దరి సినిమాలు మొదలవుతున్నాయి.

 త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తాం.  ‘చెన్నకేశవ రెడ్డి’ రీరిలీజ్‌‌కి ఊహించిన దానికంటే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మళ్లీ బాలయ్య బాబుతో సినిమా చేస్తాను. ఇక ‘నా ఆటో గ్రాఫ్’ చిత్రాన్ని రవితేజ బర్త్‌‌ డేకి రీ రిలీజ్‌‌ చేసే ప్లాన్‌‌లో ఉన్నాం.  వినాయక్, పూరి జగన్నాథ్, బోయపాటి లాంటి దర్శకులతో ఇప్పటికీ టచ్‌‌లో ఉన్నా. పూరి డైరెక్షన్‌‌ నాకు చాలా ఇష్టం.  మా అబ్బాయి హీరోగా ఆయన డైరెక్షన్‌‌లో ఓ సినిమా చేయాలని ఉంది’’.