Thandel Piracy: మరోసారి ఆర్టీసీ బస్సులో తండేల్ ప్రదర్శన.. బస్సు నెంబర్, టికెట్తో సహా నిర్మాత పోస్ట్‌

Thandel Piracy: మరోసారి ఆర్టీసీ బస్సులో తండేల్ ప్రదర్శన.. బస్సు నెంబర్, టికెట్తో సహా నిర్మాత పోస్ట్‌

తెలుగు చలనచిత్ర పరిశ్రమ కొన్నేళ్లుగా పైరసీ భూతంతో పోరాడుతోంది. టాలీవుడ్‌లో ఇదొక సాధారణ సమస్యగా మారింది. కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాను 24 గంటలు గడవక ముందే ఆన్ లైన్లో పెట్టేస్తున్నారు. ఇటీవలే గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలు కూడా 24 గంటల్లోపే వచ్చేసి మేకర్స్ షాక్ ఇచ్చింది. ఇప్పుడు తండేల్ కి పైరసీ భూతం వెంటాడుతోంది.

రీసెంట్గా తండేల్ మూవీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలాస నుంచి విజయవాడ వెళ్లిన ఆర్టీసీ బస్సులో ప్రదర్శించిన విషయం తెలిసిందే. దాంతో వెంటనే అలెర్ట్ అయిన మేకర్స్ ప్రెస్ మీట్ పెట్టి మరి వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి పైరసీకి పాల్పడితే జైలు కెళ్ళడం తప్పదంటూ నిర్మాతలు బన్ని వాసు, సమర్పకులు అల్లు అరవింద్‌ గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. 

అయినా ఏ మాత్రం లెక్కచేయకుండా మరోసారి తండేల్‌ సినిమాను ఏపీ ఆర్టీసి బస్సులో ప్రదర్శించారు. తాజాగా ఈ విషయంపై నిర్మాత బన్నీ వాసు ప్రదర్శిస్తోన్న వీడియోను, ఆ బస్సు టికెట్‌ను X ఖాతాలో షేర్‌ చేశారు. ఫిబ్రవరి 11న విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్లే బస్సులో ఈ సినిమాను ప్రదర్శించినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. 

"మా తండేల్ సినిమాను మరోసారి బస్సులో (వాహన సంఖ్య: AP 39 WB. 5566) ప్రదర్శించారు. ఈ పైరసీ వల్ల చిత్ర పరిశ్రమకు నష్టం వాటిల్లుతుంది. ఇది ఎంతోమంది క్రియేటర్స్‌ శ్రమను అగౌరవపరచడమే" అని బన్ని వాసు తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బస్సుల్లో ఇలా పైరసీ సినిమా ఫుటేజ్‌లను ప్రదర్శించకుండా కఠినమైన సర్క్యులర్‌లను జారీ చేయాలని ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌ కొనకళ్ల నారాయణరావుకు బన్ని వాసు విజ్ఞప్తి చేశారు.

ఇది 2025 డిజిటల్ కాలం. కానీ, టెక్నాలజీ అనేది ఎన్నో ఎదురుదెబ్బలకు గురవుతుంది. వందలకోట్లు ఖర్చు పెట్టి సినిమాను నిర్మించిన నిర్మాతలకు, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసే మధ్య తరగతి వాళ్లకు ఈ లీకులు కోలుకోలేని ఎదురుదెబ్బని ఇస్తున్నాయి.

ఎప్పటికప్పుడు మూవీ మేకర్స్ సైబర్ నేరగాళ్లపై కంప్లైంట్స్ ఇస్తున్నా, ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా.. ఈ లీకుల పర్వం మాత్రం ఆగట్లేదు. అభివృద్ధి ఐన టెక్నాలజీ సమస్యనా? లేక మనుషులలో దుర్వినియోగ పరిచే ఆలోచన సమస్యనా? అనేది ఆలోచించాల్సి ఉంది.

సినిమాను వినోదంగా చూస్తూ ఎంజాయ్ చేయాలి. వీలైతే విజ్ఞానం పొందాలి. అంతకుమించి పైరసీతో డబ్బులు సంపాదించి సైకో ఆనందాన్ని అనుభవించాలి మాత్రం అనుకోవొద్దు.

ఏదేమైనా కోట్లు ఖర్చు పెట్టిన సినిమా ఇలా పైరసీ భూతంతో కాలిపోవడం ప్రమాదం. అయితే, ఈ లీకుల విషయంపై నిర్మాతలు, సైబర్ టీమ్ ఎంత ప్రయత్నించిన తరుచూ కంటిన్యూ అవుతుండటం.. భవిష్యత్తు సినిమాలకు ప్రమాదంగా నిలిచే అవకాశముంది.