- తమిళనాడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిర్ణయం
- యూట్యూబర్ల రివ్యూల వల్ల సినిమాకు నష్టం వస్తుందని నిర్మాతల ఆవేదన
చెన్నై: సినిమా రిలీజ్ సమయంలో యూట్యూబర్లు థియేటర్ బయట నిలబడి మూవీ రివ్యూలు ఇవ్వకుండా చూడాలని థియేటర్ల యజమానులను తమిళనాడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (టీఎన్‌పీసీ) కోరింది. థియేటర్ల ముందుకు యూట్యూబర్లు రాకుండా నిషేధం విధించాలని విజ్ఞప్తి చేసింది. ఫస్ట్ డే ఫస్ట్ షో రోజే థియేటర్ల వద్ద నిలబడి హాల్‌లో నుంచి బయటకు వస్తున్న ప్రేక్షకుల నుంచి రివ్యూ తీసుకోవడం వల్ల సినిమాలకు నష్టం వస్తుందని వారు అభిప్రాయపడ్డారు. ప్రేక్షకులు కూడా యూట్యూబర్లకు రివ్యూలు ఇచ్చే విషయంలో దూరంగా ఉండాలని టీఎన్‌పీసీ సభ్యులు కోరారు.
రివ్యూ ఇస్తున్న టైమ్‌లో సినిమాలో నటించిన వాళ్లను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఈమేరకు బుధవారం టీఎన్‌పీసీ నాలుగు పేజీల లేఖ విడుదల చేసింది. యూట్యూబ్ రివ్యూవర్ల వల్ల ఇండియన్–2, వెట్టాయన్, కంగువా సినిమాలు తీవ్రంగా నష్టపోయాయని పేర్కొన్నారు. సినిమాలు బాగున్నా.. యూట్యూబర్లకు అడియన్స్ ఇచ్చే నెగిటివ్ రివ్యూల వల్ల మూవీస్‌కు జనం రావడం లేదన్నారు.
సూర్య నటించిన కంగువా విషయంలో యూట్యూబర్లు ఇచ్చిన రివ్యూలతో సినిమాపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. అయితే, జర్నలిస్టులు సినిమా బలాలు, బలహీనతలను విమర్శించొచ్చు.. కానీ, వ్యక్తిగత దాడులు, సమీక్షల ద్వారా సినిమాను తొక్కే ప్రయత్నాలను అంగీకరించేది లేదని టీఎన్‌పీసీ స్పష్టం చేసింది. జర్నలిస్టులు దురుద్దేశంతో సినిమాపై నెగెటివ్ రివ్యూలు రాసే పద్ధతికి మానుకోవాలని కోరారు.