సినీ అవార్డులను వివాదం చేయొద్దు: దిల్ రాజు

సినీ అవార్డులను వివాదం చేయొద్దు: దిల్ రాజు
  • 10 ఏండ్ల తర్వాత ప్రభుత్వం అధికారికంగా పురస్కారాలు ఇస్తున్నది
  • వచ్చే నెలలో గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
  • నంది అవార్డుల గైడ్​లైన్స్​లో కొన్ని మార్పులు చేశామన్న ఎఫ్​డీసీ చైర్మన్


హైదరాబాద్, వెలుగు: సినిమా అవార్డుల అంశాన్ని వివాదం చేయొద్దని ఫిల్మ్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ (ఎఫ్​డీసీ) చైర్మన్, నిర్మాత దిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాజు అన్నారు. ప్రతి ఒక్కరూ పాజిటివ్​గా తీసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అప్పుడే ప్రతి ఏటా అవార్డుల ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మాసాబ్​ట్యాంక్​లోని ఎఫ్​డీసీ ఆఫీస్​లో బుధవారం దిల్​రాజు మీడియాతో మాట్లాడారు. ‘‘గద్దర్ అవార్డుల గైడ్​లైన్స్ కోసం డైరెక్టర్లు, నిర్మాతలతో కలిసి కమిటీ ఏర్పాటు చేసింది. గైడ్​లైన్స్ ఖరారయ్యాయి. 

నంది అవార్డులకు ఉన్న గైడ్ లైన్స్ లో కొన్ని మార్పులు చేర్పులు చేశాం. నిరుడుకు సంబంధించిన అవార్డులను వారంలోగా జ్యూరీ కమిటీ ఫైనల్ చేస్తుంది. వచ్చే నెలలో గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ (జీటీఎఫ్ఏ) ప్రదానోత్సవ కార్యక్రమం ఉంటుంది. తెలంగాణ ఏర్పడ్డాక మొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అవార్డులు ఇస్తున్నది. దీన్ని ఎవరూ వ్యతిరేకించొద్దు. గద్దర్ అవార్డు నమూనా కూడా రెడీ అవుతున్నది. త్వరలో ఫైనల్ అవుతది. 

అవార్డులు ఎవరైనా ఇవ్వొచ్చు. ఫిలిం చాంబర్ ఇస్తే మాకేం అభ్యంతరం లేదు’’అని దిల్ రాజు అన్నారు. పైడి జయరాజ్, కాంతారావు పేరుతో కూడా పురస్కారాలు ఇస్తామని తెలిపారు. ‘‘మొత్తం 11 కేటగిరీల్లో అవార్డులు ఇస్తున్నాం. 22 పురస్కారాలను వ్యక్తిగత కేటగిరిల్లో అందజేస్తున్నాం. ఉర్దూ సినిమాలను ప్రోత్సహించేందుకు కూడా ఒక అవార్డు కేటాయించాం. 2014 నుంచి 2023 వరకు ఏడాదికో సినిమా చొప్పున గద్దర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవార్డును ప్రకటిస్తాం. ‘సింహా’ అవార్డుల దరఖాస్తుదారులకు డబ్బు తిరిగి ఇచ్చేస్తాం’’అని దిల్ రాజు అన్నారు.