నా ఒక్కడిపైనే కాదు.. ఇండస్ట్రీ మొత్తం మీద ఐటీ దాడులు: దిల్ రాజ్

నా ఒక్కడిపైనే కాదు.. ఇండస్ట్రీ మొత్తం మీద ఐటీ దాడులు: దిల్ రాజ్

హైదరాబాద్: టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల ఇండ్లపై జరుగుతోన్న ఇన్‎కమ్ ట్యాక్స్ (ఐటీ) రైడ్స్‎పై ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ స్పందించారు. నా ఒక్కడి పైనే ఐటీ దాడులు జరగడం లేదని.. టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం మీద ఐటీ రైడ్స్ జరుగుతున్నాయని తెలిపారు. ప్రొడ్యూసర్ దిల్ రాజ్‎తో పాటు మైత్రీ మూవీ మేకర్స్, డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, సుకుమార్‎తో పాటు మరికొందరు టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. మంగళవారం (జనవరి 21) ఉదయం మొదలైన ఐటీ అధికారుల తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. మొత్తం 55 బృందాలుగా విడిపోయి హైదరాబాద్‎లోని పలు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలు, బ్యాంక్ లాకర్లను క్షుణ్ణంగా ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దిల్ రాజు సోదరుడు, కుమార్తె, బంధువుల ఇళ్లలో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. వీరు సినిమాలకు పెట్టిన బడ్జెట్, వచ్చిన ఆదాయం వంటి అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. టాలీవుడ్‎పై ఒక్కసారిగా ఐటీ అధికారులు నజర్ పెట్టడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.