అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. పుష్ప 2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగి ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా.. ఆమె కుమారుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఒక్కరాత్రి జైల్లో ఉండివచ్చిన అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టిన సినీ సెలబ్రెటీలు.. అదే సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన మహిళ కుటుంబాన్ని, ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న బాలుడిని సినీ ప్రముఖులు పరామర్శించకపోవడాన్ని సీఎం రేవంత్ రెడ్డి తప్పుబట్టారు.
పుష్ప 2 ఇన్సిడెంట్ను దృష్టిలో పెట్టుకుని ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోస్, టికెట్ల రేట్ల పెంపు ఉండదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో టాలీవుడ్ ప్రొడ్యూసర్స్, ఎగ్జిబ్యూటర్స్ అయోమయంలో పడిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో ఇండస్ట్రీని ఏపీకి తరలిస్తారని జోరుగా ప్రచారం ఊపందుకుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ టీడీపీ చీఫ్ చేసిన కామెంట్స్ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి.
ఈ క్రమంలో టాలీవుడ్ ఏపీకి తరలి వెళ్తోందని జరుగుతోన్న ప్రచారంపై టాప్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. ఫిల్మ్ ఇండస్ట్రీ ఏపీకి వెళ్తోందని వినిపిస్తోన్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. టాలీవుడ్ ఎక్కడకి వెళ్లదని.. ఇక్కడ హైదరాబాద్‌లోని ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. మేం ఎక్కడకి వెళ్ళమని.. ఇక్కడే ఉంటామన్న నాగవంశీ.. సొంతిల్లు ఇక్కడ ఉంటే ఇంకా వేరే దగ్గరకు ఎలా వెళ్తామని అన్నారు.
ALSO READ : Pushpa 2 Box office Day 18: నాన్‍స్టాప్ రికార్డులతో పుష్ప 2.. ఇండియా బాక్సాఫీస్ డే 18 కలెక్షన్ ఎంతంటే?
ఏపీ, తెలంగాణకు సమ ప్రాధాన్యత ఇస్తామని.. షూటింగ్స్, ఈవెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయని స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి టాలీవుడ్‌కు అవసరమని అభిప్రాయపడ్డారు. ఇండస్ట్రీ ఏపీకి వెళుతుందనేది ప్రచారం కరెక్ట్ కాదని.. ఇది తప్పుడు ప్రచారమని వివరణ ఇచ్చారు. ఇక, బాలకృష్ణ హీరోగా నిర్మాత నాగవంశీ తెరకెక్కించిన డాకు మహారాజ్ మూవీ సంక్రాంతి రేసులో ఉన్న సంగతి తెలిసిందే. 2025, జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు ఈ మూవీ సిద్ధంగా ఉంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ జోరు పెంచింది. ఇందులో భాగంగానే సోమవారం నిర్వహించిన ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూనే నాగవంశీ పై కామెంట్స్ చేశారు.