ఆర్జీవీపై నిర్మాత నట్టి కుమార్ ఫైర్

దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ప్రొడ్యూసర్ నట్టికుమార్ ఫైర్ అయ్యారు. తన సినిమాలకు డబ్బులు పెట్టుబడిగా పెట్టిన ఫైనాన్సియర్లు, నిర్మాతలను మోసం చేస్తూ, తిరిగి వారిమీదే కేసులు పెట్టే పరిస్థితికి ఆర్జీవీ దిగజారడం సిగ్గుచేటన్నారు నిర్మాత నట్టి కుమార్. తన సంతకం ఫోర్జరీ చేశారంటూ నట్టి ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన క్రాంతి, కరుణలపై ఆర్జీవీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో .. దీనికి నట్టి కుమార్‌ కౌంటర్‌ ఇచ్చారు. సినిమాలకు పెట్టిన డబ్బులు ఇవ్వాలని అడిగితే తన పిల్లలపై ఆర్జీవీ తప్పుడు కేసులు పెట్టాడని నట్టికుమార్ ఆరోపించారు. టాలీవుడ్లో తనతో పాటు చాలా మందిని ఆర్జీవీ మోసం చేశాడన్నారు.  వాళ్లంతా తనతో కలసి ఎక్కడ పోరాటం చేస్తారోనన్న ఉద్దేశ్యంతోనే  పథకం ప్రకారం తన పిల్లలపై కేసులు పెట్టాడని తెలిపారు.  ఫ్యామిలీ మీద కేసులు పెడితే భయపడేది లేదని స్పష్టం చేశారు. 

వర్మను వదిలే ప్రసక్తే లేదు...
22 డాక్యూమెంట్స్ వర్మ తమకు ఇచ్చాడని.. అందులో వందల సంతకాలు పెట్టాడని  నట్టికుమార్ తెలిపారు. తాము బ్యాంకు ద్వారా ఇచ్చిన డబ్బులు వంటివన్నీ  ఫోర్జరీయే అవుతాయా! వీటన్నింటికీ వర్మ ఏం సమాధానం చెబుతాడని ప్రశ్నించారు.  రాంగోపాల్ వర్మ తమకు ఇవ్వాల్సిన డబ్బులపై  కోర్టుకు వెళ్లామన్నారు. ఆ మేరకే వర్మ తీసిన లడకీ (ఎంటర్ ది గర్ల్ డ్రాగన్),  మా ఇష్టం (డేంజరస్)  చిత్రాలు విడుదల కాకుండా  కోర్టు నిలిపి వేసిందన్నారు. వర్మ సినిమాలేవీ ఇకపై విడుదల కాకుండా ఇలానే అడ్డుకుంటామన్నారు. తమకు డబ్బులు చెల్లించేంతవరకు వర్మను వదిలే ప్రసక్తే లేదనిహెచ్చరించారు నట్టికుమార్. వర్మ సినిమాలు వేటినీ కొనవద్దని, అలాగే ఆయనతో కలసి సినిమాలు తీయవద్దని టాలీవుడ్ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు సూచించారు. ఎందుకంటే అవి విడుదల కాకుండా  నిలిచిపోతాయని చెప్పారు. తమను మోసం చేసినట్లే మిగతా వారిని వర్మ  మోసం చేస్తాడని అందరూ గ్రహించాలన్నారు.

నన్ను కూడా మోసం చేశాడు: నిర్మాత శేఖర్
ఆర్జీవీ తన దగ్గర 56 లక్షలు తీసుకున్నాడని తెలిపారు నిర్మాత్ శేఖర్. సినిమా రంగంలోనికి తాను ఫ్యాషన్తో వచ్చానని..అయితే  దిశా సినిమాకు తననే నిర్మాత పెడతానని నమ్మించి 56 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు.  అయితే ఆ సినిమాకు వేరే నిర్మాతల పేర్లు వేసి, తనను మోసం చేశాడని చెప్పారు. ఈ విషయంపై ఎన్నోసార్లు ఆయనను కలిసే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందన్నారు. ఇక లాభం లేదనుకుని మియాపూర్ పోలీస్ స్టేషన్లో వర్మపై ఫిర్యాదు చేశానని..పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదయ్యాయన్నారు.  తనకు రావలసిన డబ్బులపై లీగల్గా పోరాటం చేస్తున్నట్లు  నిర్మాత శేఖర్ వివరించారు.