
- ఫలసాయం లేకపోవడం ప్రజల్లో నిరాసక్తత
- పరిస్థితులకు అనుగుణంగా పెరగని ఉత్పత్తుల రేట్లు
- ఫోకస్ పెట్టని ఐటీడీఏ, జీసీసీలు
- మార్చి వచ్చినా డిసైడ్ కాని రేట్లు
ఆసిఫాబాద్, వెలుగు: అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు, ఇతర తెగలకు అడవి ఉత్పత్తులే జీవనాధారం. ఉత్పత్తులను సేకరించి వచ్చిన కొద్ది డబ్బుతో కాలం వెళ్లదీసేవారు. కానీ ప్రోత్సాహం లేకపోవడం, గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో గిరిపుత్రులకు, అడవికి రానురాను దూరం పెరుగుతోంది. గతంలో ఉపాధినిచ్చిన అటవీ ఉత్పత్తులు నేడు గిరిజనుల కడుపు నింపడం లేదు. వాతావరణ పరిస్థితుల కారణంగా ఉత్పత్తులు సైతం ఆశించిన స్థాయిలో లభించడంలేదు. దీనికి తోడు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో అటవీ ఉత్పత్తుల సేకరణ పూర్తిగా తగ్గిపోతోంది. గతంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో జీసీసీలు అటవీ ఉత్పత్తులను సేకరించేవి. కానీ కొన్నేళ్లుగా పరిస్థితి మారింది. ఎండాకాలం సీజన్ ప్రారంభమైనా ఇప్పటికీ అటవీ ఉత్పత్తుల రేటు ఫిక్స్ చేయకపోవడం పరిస్థితికి అద్దంపడుతోంది.
మార్కెట్ లో అన్నింటి రేట్లు పెరిగినా..
ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న 15 మండలాల్లో 13 గిరిజన మండలాలే. వర్షాకాలంలో వ్యవసాయం సాగు చేసుకునే గిరిజనులు వేసవిలో మూడు నెలలపాటు అడవిలో లభించే అటవీ ఉత్పత్తులను సేకరించి ఉపాధి పొందుతారు. అడవుల్లో దొరికే విప్ప పువ్వు, తప్పి జిగురు, విప్ప పరక, తేనె, తేనె మైనం, విషముష్టి గింజలు, నల్ల జీజి గింజలు, నరమామిడి చెక్క, కానుగ గింజలు తదితర ఉత్పత్తులను జీసీసీ డీఆర్ డిపోల్లో అమ్మి ఉపాధి పొందుతుంటారు.
ప్రాణాలకు తెగించి రాత్రీపగలు అడవుల్లో తిరిగి గిరిజనులు సేకరించిన ఉత్పత్తులకు గవర్నమెంట్ ఇస్తున్న ధర చాలా తక్కువ. గతేడాది తేనె కిలో ధర బయట మార్కెట్ లో రూ.450 ఉంటే గవర్నమెంట్ మాత్రం రూ.195కే కొనుగోలు చేసింది. విప్ప పువ్వు కిలో బయట రూ.50 ఉంటే గవర్నమెంట్ మాత్రం కిలో రూ.20కు కొన్నది. దాదాపు అన్ని ఉత్పత్తులను కూడా సగం ధరలకు కూడా కొనలేదు.
మొక్కుబడిగా కొనుగోళ్లు
గిరిజనులు సేకరించి అమ్మే ఉత్పత్తులను కొనేందుకు గిరిజన సహకార సంస్థ ప్రతి ఏటా ఫిబ్రవరిలో కొనుగోలు రేట్లు సవరించి గిట్టుబాట య్యేలా చర్యలు తీసుకుంటుంది. కానీ ఈ ఏడాది మార్చి ఇప్పటి వరకు రేట్లు ఫిక్స్ చేయలేదు. గతేడాది సైతం అధికారులు కొనుగోలుపై దృష్టి పెట్టలేదు. అరకొర ఉత్పత్తులు కొని చేతులు దులుపుకున్నారు. ఓ వైపు ఉత్పత్తులు తగ్గిపోవడం, మరోవైపు గిట్టుబాటు ధర లేకపోవడంతో గిరిజనులకు ఉపాధి కరువవుతోంది. తమను ఆదుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. తాము సేకరించిన ఉత్పత్తులను అమ్మేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, మద్దతు ధర ఇవ్వాలని కోరుతున్నారు.
గిట్టుబాటు ధర కల్పించాలి
ప్రతి ఏటా అటవీ ఉత్పత్తులతో ఉపాధి పొందుతాం. ఈ సీజన్లో వ్యవసాయ పనులు లేకపోవడంతో అటవీ ఉత్పత్తులు సేకరించి మార్కెట్లో అమ్ముకుంటున్నాం. కానీ గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నాం. ప్రభుత్వం స్పందించి ఈసారైనా గిట్టుబాటు ధర కల్పించాలి.
సిడం ఖనిరామ్, జైనూర్
ధర కల్పించేందుకు చర్యలు
గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటం.సేకరించిన ఉత్పత్తులు జీసీసీలో విక్రయించి గిట్టుబాటు ధర పొందాలి.ఈ ఏడాది రేట్లు ఇంకా ఖరారు కాలేదు. త్వరలోనే ఫిక్స్ చేస్తం.
తారచంద్, జీసీసీ మేనేజర్ ,ఆసిఫాబాద్