ధాన్యం కొనుగోలుకు 351 సెంటర్లు

 ధాన్యం కొనుగోలుకు 351 సెంటర్లు
  • అక్టోబర్​ రెండో వారంలో ప్రారంభం
  •  వానాకాలం వడ్ల దిగుబడి 6.60 లక్షల మెట్రిక్​ టన్నులు
  • కొనుగోళ్లపై ఆయా శాఖల అధికారులతో కలెక్టర్​ సమీక్ష
  • గన్నీ బ్యాగులు, కాంటాలు, టార్పాలిన్లు, ట్రాన్స్ పోర్ట్​ఏర్పాట్లపై ఫోకస్​

కామారెడ్డి జిల్లాలో వానాకాలం సీజన్లో 6.6 ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లక్షల మెట్రిక్​ టన్నుల వడ్ల దిగుబడి వస్తుందని అధికార యంత్రాంగం అంచనా వేసింది.   దిగుబడిని పూర్తి స్థాయిలో కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేస్తోంది.  ఇందుకు 351 సెంటర్లు  ఏర్పాటు చేయనున్నారు.  కొనుగోళ్ల పై ఆయా శాఖల ఆఫీసర్లతో ఇప్పటికే కలెక్టర్​ రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు,  కాంటాలు, ట్రాన్స్​ఫోర్ట్​  వసతులు కల్పించాలని ఆదేశించారు. అక్టోబర్​ రెండో వారంలో సెంటర్లు ప్రారంభం కానున్నాయి. 


కామారెడ్డి, వెలుగు : వానాకాలం సీజన్​లో జిల్లాలో రైతులు2.80 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు.  6.60 లక్షల మెట్రిక్​ టన్నుల దిగుబడి  వస్తుందని అధికారులు అంచనా వేశారు.  వాతావరణం అనుకూలంగా ఉంటే దిగుబడి మరింత వస్తుందని భావిస్తున్నారు. దిగుబడికి అనుగుణంగా కొనుగోళ్లు చేపట్టడానికి  ఏర్పాట్లు చేస్తున్నారు.   బాన్స్​వాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజక వర్గాల్లో వరి విస్తీర్ణం ఎక్కువగా ఉంది.  జిల్లాలోని బాన్స్​వాడ  డివిజన్​లో  నాట్లు ముందు వేస్తారు. దీంతో ఇక్కడ కోతలు ముందుగానే  మొదలవుతాయి.  

కోతలు షురూ కానున్న దృష్ట్యా.. 

అక్టోబర్​రెండో వారం నుంచి వరి కొనుగోలు సెంటర్లు ఏర్పాటు కానున్నాయి.  బాన్సువాడ డివిజన్లో ముందుగానే కోతలు షూరు కానున్న దృష్ట్యా ఇక్కడ సెంటర్లు  ప్రారంభిస్తారు. కోతలు పెరిగేకొద్ది మిగతా ఏరియాల్లో  సెంటర్లు ఓపెన్​ చేస్తారు.  మొత్తం 351 సెంటర్లు ఏర్పాటుకానున్నాయి.   ఇందులో  328 సహకార సంఘాలు, 23 మహిళా సమాఖ్య సంఘాల ఆధ్వర్యంలో తెరుస్తారు.  వడ్ల కొనుగోలుకు  1. 41 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం. 27 లక్షలు అందుబాటులో ఉండగా, 1.14 కోట్లు తెప్పించేందుకు చర్యలు  చేపట్టారు. అలాగే 10,500 టార్పాలిన్లు అవసరం కాగా  8,900 మార్కెటింగ్​ శాఖ వద్ద  ఉన్నాయి.  702 కాంటాలకుగాను 486 అందుబాటులో ఉన్నాయి.   మరిన్ని కాంటల కొనుగోలుకు చర్యలు  తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.   తేమ శాతం  చూసే మిషన్లు 351 ఉన్నాయి. 

ఏర్పాట్లపై ఫోకస్​

రైతులకు ఇబ్బందులు లేకుండా వడ్ల కొనుగోళ్లు సక్రమంగా చేపట్టేందుకు కలెక్టర్​ ఆశిశ్​సంగ్వాన్​ ఆయా శాఖల ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు.  అగ్రికల్చర్, సివిల్,  మార్కెటింగ్,  రెవెన్యూ, ట్రాన్స్​ఫోర్ట్,  కోఆపరేటివ్ శాఖ ఆఫీసర్లతో రివ్యూ చేశారు. వడ్ల కొనుగోలుకు ఆయా శాఖల ఆఫీసర్లు ఏర్పాట్లు చేపట్టాలన్నారు.  కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చూడాలన్నారు.

కోతలు పెరిగేకొద్ది సెంటర్ల ఏర్పాటు

వరి కోతలు  షూరు అయిన ఏరియాల్లో కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేస్తాం.  రైతులకు సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటాం.  సెంటర్లలో వసతులు కల్పిస్తాం. అక్టోబర్​ రెండో వారంలో సెంటర్లు ప్రారంభమవుతాయి.  సెంటర్​కు వచ్చిన వడ్ల తేమ శాతం పరిశీలించి కొనుగోలు చేస్తాం.  ట్రాన్స్​ఫోర్ట్,  కాంటాలు, తేమశాతం మిషన్లు, టార్పాలిన్లు, గన్నీ బాగులు అందుబాటులో ఉంచాలని ఆదేశించాం. - మల్లికార్జునబాబు, డీఎస్​వో