
- అధికారులకు కలెక్టర్ల సూచన
నిర్మల్/ఆదిలాబాద్, వెలుగు: స్కూల్ యూనిఫామ్ ల తయారినీ వేగవంతం చేయాలని నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్లు ఆశిష్ సంగ్వాన్, రాజర్షి షా అధికారులను ఆదేశించారు. నిర్మల్ పట్టణంలోని మంజులాపూర్లో మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల ద్వారా స్టూడెంట్ల యూనిఫామ్లు తయారు చేస్తున్న టైలరింగ్ కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ఆశిష్ పరిశీలించారు. టైలరింగ్ను నాణ్యతతో చేపట్టాలన్నారు. విద్యార్థుల నుంచి తీసుకున్న కొలతల ప్రకారమే బట్టలు సిద్ధం చేయాలని, విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే యూనిఫామ్లు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇప్పటివరకు తయారైన, తయారు కావాల్సిన వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిద్దాపూర్ ప్రభుత్వ పాఠశాల, సోన్ మండలం న్యూ వెల్మల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన పనులను కలెక్టర్ పరిశీలించారు. జూన్ 5లోపు పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. డీఈవో రవీందర్ రెడ్డి, డీఆర్డీవో విజయ లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ రాజు, మెప్మా పీడీ సుభాష్, పంచాయతీ రాజ్ ఈఈ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
జూన్ 6లోగా స్ట్రిచ్చింగ్ పూర్తిచేయాలి
జూన్ 6లోగా యూనిఫామ్ల స్ట్రిచ్చింగ్ పూర్తిచేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం తన చాంబర్లో డీఈవో, డీఆర్డీవో అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని 1142 పాఠశాలల్లోని మొత్తం 67,178 విద్యార్థినీ విద్యార్థులకు సంబంధించి వారి కొలతల ఆధారంగా యూనిఫామ్లు స్ట్రిచ్చింగ్ చేయాలన్నారు. దుస్తుల తయారీలో నాణ్యత పాటించేలా చూడాలన్నారు. విద్యాసంవత్సరం ప్రారంభం రోజే విద్యార్థులకు యూనిఫామ్లు అందించేలా కార్యాచరణ రూపొందించుకొని పనులు వేగంగా పూర్తిచేయాలన్నారు. ఈ సమావేశంలో డీఈవో ప్రణీత, డీఆర్డీవో సాయన్న పాల్గొన్నారు.