400 ఎకరాల్లో ప్రకృతిని ధ్వంసం చేయొద్దు.. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రొఫెసర్​ హరగోపాల్ విజ్ఞప్తి

400 ఎకరాల్లో ప్రకృతిని ధ్వంసం చేయొద్దు.. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రొఫెసర్​ హరగోపాల్ విజ్ఞప్తి
  • రాష్ట్ర ప్రభుత్వానికి ప్రొఫెసర్​ హరగోపాల్ విజ్ఞప్తి
  • ప్రతిపక్షాలు విద్యార్థులను రెచ్చగొట్టడం మానుకోవాలని సూచన

బషీర్​బాగ్, వెలుగు: కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానికి చెందినవే అయినప్పటికీ.. నైతికంగా హైదరాబాద్ సెంట్రల్​యూనివర్సిటీకి చెందుతాయని పౌర హక్కుల నాయకుడు ప్రొఫెసర్ హరగోపాల్ చెప్పారు. ప్రకృతిని ధ్వంసం చేయొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సెక్రటేరియెట్​ లో మంత్రులు, అధికారులతో చర్చించిన అంశాలపై బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు. 400 ఎకరాలను 50 ఏండ్లుగా హెచ్‌‌సీయూ కాపాడుకుంటూ వస్తోందన్నారు. బుల్డోజర్లతో చెట్లు కూల్చడంతోపాటు వన్యప్రాణులను తరిమేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

చెట్లు పెరగడానికి ఎన్నో ఏండ్లు పట్టిందని, క్షణాల్లో నేలమట్టం చేయడం మంచిది కాదన్నారు. ప్రకృతి విధ్వంసంతో మానవ మనుగడకు ప్రమాదకరం అని చెప్పారు. అటవీ ప్రాంతాన్ని పరిరక్షిస్తే ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ప్రైవేట్​వ్యక్తులకు అమ్మాలని చూస్తే ఒప్పుకోబోమన్నారు. ప్రతిపక్షాలు విద్యార్థులను రెచ్చగొట్టడం మానుకోవాలని హరగోపాల్ సూచించారు. హెచ్ సీయూ రిటైర్డ్ డీన్ ప్రొఫెసర్ డి.నరసింహారెడ్డి, ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక రాష్ట్ర నాయకుడు విస్సా కిరణ్ కుమార్ పాల్గొన్నారు.

స్టూడెంట్లపై కేసులు ఎత్తివేయాలి: విమలక్క
కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాలను హెచ్​సీయూకే కేటాయించాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క డిమాండ్ చేశారు. ప్రపంచ పర్యావరణ సంస్థ అధ్యక్షులు భద్ర, పి.డి.ఎస్.యూ(విజృంభన) నాయకులు విజయ్ తో కలిసి బుధవారం ఆమె హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో మీడియాతో మాట్లాడారు. భూవివాదంతో హెచ్ సీయూలో విద్యా వాతావరణం దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవ వైవిద్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. విద్యార్థులపై లాఠీచార్జ్ ఆపాలని, అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

సెక్రటేరియెట్​ ముట్టడికి యత్నం
అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా, హెచ్​సీయూ భూములను వేల కోట్లకు అమ్ముకునే కుట్ర చేస్తోందని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి ఆరోపించారు. బుధవారం మహిళా మోర్చా ఆధ్వర్యంలో సెక్రటేరియెట్​ ముట్టడికి యత్నించారు. సౌత్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్​చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.

హెచ్​సీయూ భూములను రక్షించాలని డిమాండ్​చేస్తూ బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో జేఎన్టీయూ స్టూడెంట్లు క్లాసులను బహిష్కరించారు. హెచ్​సీయూ భూములను వేలం ద్వారా విక్రయించాలనే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ ​చేశారు. హెచ్​సీయూ విద్యార్థుల ఉద్యమానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని కూకట్​పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. విద్యార్థులతో కలిసి తాము అడ్డుకుంటామని స్పష్టం చేశారు. 400 ఎకరాల భూమి విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బుధవారం పరిగి బస్టాండ్​వద్ద సీపీఎం నాయకులు ఆందోళన చేపట్టారు.