తెలంగాణ అస్తిత్వాన్ని బీఆర్ఎస్ నాశనం చేసింది : హరగోపాల్

తెలంగాణ అస్తిత్వాన్ని బీఆర్ఎస్ నాశనం చేసింది : హరగోపాల్

సంపద ఉన్నోళ్ల చుట్టే రాజకీయ నాయకులు తిరుగుతున్నారని పీపుల్స్ జేఏసీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసిందన్నారు. ప్రజాస్వామ్య సంస్కృతి పోయిందని, దాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. పాటలు కనుమరుగు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పేరు మీద గెలిచి... గౌరవం లేకుండా చేశారని అన్నారు. 

తెలంగాణను మరిచిపోయేలా చేశారని చెప్పారు ప్రొఫెసర్ హరగోపాల్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జిల్లాల విభజన పేరుతో ముక్కలు చేసి విశిష్టత లేకుండా చేశారని తెలిపారు. తెలంగాణ పేరుతో ఉద్యమాలు చేసి.. భారత్ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు. అసలు తెలంగాణ ఎక్కడికి పోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు వస్తేనే బీఆర్ఎస్ నేతలకు, మంత్రులకు తెలంగాణ గుర్తుకు వస్తుందా..? అని ప్రశ్నించారు. 

తెలంగాణ చరిత్రను కనుమరుగు చేస్తున్నారని మండిపడ్డారు. భూములు అక్రమంగా కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ వచ్చాక ప్రభుత్వ యూనివర్శిటీలను నిర్వీర్యం చేశారని చెప్పారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్శిటీలను పట్టించుకోవడం మానేశారని అన్నారు. రాష్ట్రంలోని గవర్నమెంట్ పాఠశాలలను పాడు చేశారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనపై పౌర సమాజం చైతన్యంగా ఆలోచించాలని పిలుపునిచ్చారు.