- ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు.. రాష్ట్రపతి ఉత్తర్వులకువిరుద్ధం
- తీర్పు అమలు చేయాలంటే ఆ ఉత్తర్వులు, ఆర్టికల్ 341ను సవరించాలి: కంచ ఐలయ్య
- బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వర్గీకరణపై సైలెంట్‌గా ఉందని వ్యాఖ్య
- ఎస్సీ వర్గీకరణ జడ్జిమెంట్‌పై రౌండ్ టేబుల్ మీటింగ్
- పలు సలహాలు, సూచనలు ఇచ్చిన మేధావులు
హైదరాబాద్ ,వెలుగు: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఉందని ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు. ఆ తీర్పును అమలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని, వాటిని సవరించాలంటే ఆర్టికల్ 341ను సైతం సవరించాలని తెలిపారు. ఆదివారం హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజాలో సెంటర్ ఫర్ బెటర్ ఇండియా రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో “ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు” అన్న అంశంపై చర్చాగోష్టి జరిగింది. ఇందులో కంచ ఐలయ్య, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, విద్యా కమిషన్ మెంబర్ పీఎల్ విశ్వేశ్వరరావు, ఎమ్మెల్సీ కోదండరాంతో పాటు మేధావులు, ప్రొఫెసర్లు, అడ్వకేట్లు హాజరై ఎస్సీ వర్గీకరణ తీర్పుపై తమ సలహాలు, సూచనలు తెలిపారు. ఈ సమావేశంలో కంచ ఐలయ్య మాట్లాడుతూ.. సాధారణంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు అందులో కేంద్ర ప్రభుత్వం ఒక పార్టీగా ఉన్నట్టైతే అభిప్రాయం తెలియజేయాలని కేంద్రాన్ని రిటన్ సబ్మిషన్ అడుగుతుందన్నారు.
2004లో ఎస్సీ వర్గీకరణపై తీర్పు సందర్భంగా కూడా సుప్రీంకోర్టు కేంద్రాన్ని అభిప్రాయం అడిగిందని గుర్తు చేశారు. అప్పుడు కేంద్రం ఇచ్చిన వివరణలో రాష్ట్రపతి ఉత్తర్వులను సుప్రీంకోర్టు సవరించలేదని పేర్కొందన్నారు. దీంతో ఆ టైమ్‌లో కేసును విచారించినది రాజ్యాంగ ధర్మాసనం కాకపోవడంతో న్యాయమూర్తులు కేసును డిస్మిస్ చేశారని చెప్పారు. మరోవైపు ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలంటే ఎస్సీ కులాల లెక్కలు కావాలన్నారు. అయితే దేశంలోని ఏ రాష్ట్రం వద్ద సరైన, చట్టబద్ధమైన లెక్కలు లేవన్నారు. ఢిల్లీలోని రాజ్యంగబద్ధమైన సంస్థ ‘రిజిస్టార్ ఆఫ్ సెన్సెన్’ ఇచ్చే లెక్కలు మాత్రమే చట్టబద్ధమైనవని.. కనుక ఎస్సీల్లోని అన్ని కులాల జనాభా సంఖ్య కచ్చితంగా తేల్చాల్సింది కేంద్రభుత్వమే అన్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ అంశంపై అన్ని రాష్ట్రాలు అసెంబ్లీలలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఆయన సూచించారు.
అధికారంలో లేని చోటే బీజేపీ డిమాండ్ చేస్తున్నది
2009లో కోమట్లు సామాజిక స్మగ్లర్లు అనే బుక్ రాసినప్పుడు తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని కంచ ఐలయ్య గుర్తు చేశారు. ఇటీవల ఆ కేసును హైకోర్టు కొట్టి వేసిందని చెప్పారు. ‘‘అప్పట్లో వైశ్యులతో కలిసి మంద కృష్ణ మాదిగ ప్రెస్ మీట్ పెట్టి నేను పెద్ద నేరం చేశానని.. అంబానీ, అదానీలను స్మగ్లర్లు అనటం కరెక్ట్ కాదని విమర్శించారు. మాలలు సోషల్ స్మగ్లర్లు అని మందకృష్ణ ఇప్పుడు అంటున్నరు. అంబానీ, అదానీలు సోషల్ స్మగ్లర్లు కాదు మాలలు సోషల్ స్మగ్లర్లు అనేది ఆయన ఉద్దేశం. ఇది గొప్ప ఎనాలసిస్, ఇంత గొప్ప ఎనాలసిస్ నేను ఎక్కడా చూడలేదు” అని ఐలయ్య వ్యాఖ్యానించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం జడ్జిమెంట్ రాష్ట్రపతి ఉత్తర్వులే తప్పు అనే విధంగా ఉందంటూ ఆ తీర్పును ఆయన చదివి వినిపించారు. “రాష్ట్రపతి ఉత్తర్వులు ఇంకా అమలులోనే ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆర్టికల్ 340లోని క్లాజ్1 ప్రకారం.. క్యాస్ట్‌లో ‘క్లాస్’ను పేర్కొనలేదు. ఆర్టికల్ 341 ప్రకారం కూడా షెడ్యూల్ క్యాస్ట్‌లలో క్లాస్ అన్నది లేదు. యూపీఎస్సీ నియామకాల్లోనూ రాజ్యాంగం, ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. కానీ, సుప్రీంకోర్టు తీర్పు మాత్రం అందుకు విరుద్ధంగా, షాకింగ్‌గా ఉంది. సుప్రీంకోర్టు తీర్పు కేవలం ఆరుగురి కోసమే అన్నట్టుగా ఉంది. ఈ తీర్పులో ఇతర జడ్జిల అభిప్రాయాలను సీజేఐ చెప్పారు. ఆ తర్వాత మిగతా ఆరుగురు జడ్జిలు కూడా అదే అభిప్రాయం రాశారు” అని ఆయన అన్నారు. వర్గీకరణ అమలు అంశంలో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సైలెంట్ గా ఉండి, వేరే పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేస్తుందన్నారు.
రాజ్యాధికారం సాధిద్దాం: గాలి వినోద్ కుమార్
రాష్ట్రంలో ఎస్సీలు, ఉప కులాలు అంతా కలిసి సీఎం దృష్టికి మన సమస్యలు తీసుకెళ్దామని గాలి వినోద్ కుమార్ అన్నారు. దళితులంతా ఒకటేనని, అందరం కలిసిరాజ్యాధికారం సాధించుకుందామని పిలుపునిచ్చారు. ఎస్సీల్లో ఏ బీ సీ డీ వర్గీకరణ చేయమని తీర్పులో సుప్రీంకోర్టు చెప్పలేదన్నారు. ఏ బీ సీ డీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదని, కేంద్రానికే ఉందని గతంలో సుప్రీం జడ్జ్ మెంట్ ఇచ్చిందన్నారు. ఎస్సీ ఉపకులాల నేత బైరి వెంకటేశం మోచి మాట్లాడుతూ.. దళితులను విడదీయాలని కుట్ర జరుగుతుందన్నారు. వర్గీకరణ చేయాలని అందరూ అంటున్నారని, ఎట్లా చేయాలి ఎందుకు చేయాలన్న అంశంపై ఎవరూ స్పందించటం లేదన్నారు.
వర్గీకరణ అమలులో కేంద్రం గైడ్‌లైన్స్ ఇవ్వలేదు: ఎమ్మెల్సీ కోదండరాం
ఎస్సీ వర్గీకరణ లో సుప్రీంకోర్టు తీర్పుతో చాలా సమస్యలు తలెత్తాయని, ఐక్యతను కాపాడుకుంటూ, సంఘటితంగా ఉద్యమం చేయాలని, సమస్యలు పరిష్కరించుకోవాలని, క్రిమీలేయర్ పై లోతైన చర్చ జరగాలని ఎమ్మెల్సీ కోదండరాం సూచించారు. ఎస్సీ వర్గీకరణే అమలుపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సరైన గైడ్ లైన్స్ ఇవ్వలేదన్నారు. ఈ సమస్యను పరిష్కరించే బాధ్యత ఇతరులకు అప్పగించకుండా మీరే సమస్యకు పరిష్కారం చూపించడం బెటరని అన్నారు. వర్గీకరణకు దారి తీసిన పరిస్ధితులు ఎస్సీలు సృష్టించినవి కావని రిజర్వేషన్ ఫలాలు ప్రభుత్వాలు సరిగా పంపకాలు చేయకపోవటం వల్లే సమస్యలు వస్తున్నాయన్నారు. జరిగిన పరిస్ధితులకు మాలలు లేదా ఇంకో వర్గం కారణమనటం తప్పన్నారు.
బీజేపీ ప్రత్యామ్నాయ రాజ్యాంగం రాసుకుంది: ప్రొఫెసర్ హరగోపాల్
రాబోయే రోజుల్లో దేశానికి పెద్ద ప్రమాదం పొంచి ఉందని ప్రొఫెసర్ హరగోపాల్ హెచ్చరించారు. ఎస్సీల్లో అందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రత్యామ్నాయ రాజ్యాంగం రాసుకున్నాయన్నారు. దానినే అమలు చేయాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తే సొంత రాజ్యాంగం అమలు చేసేదన్నారు. మాలల వల్లే మాదిగలకు అన్యాయం జరిగిందనేని కరెక్ట్ కాదన్నారు. వర్గీకరణ అమలులో లీగల్ అంశాలు పరిష్కారించుకోవాలని ఇందుకు కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.