బీఆర్‌ఎస్‌ పోతేనే యువతకు కొలువులు : కోదండరాం

నర్సంపేట , వెలుగు : బీఆర్ఎస్​ ప్రభుత్వం పోతేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని టీజేఎస్​ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. నిరుద్యోగుల ఆగ్రహాన్ని బీఆర్ఎస్ ​లీడర్లు గ్రహించారని, అందుకే జాబ్  క్యాలెండర్, రెండు లక్షల ఉద్యోగాలు అంటూ గిమ్మిక్కులు చేస్తున్నారని ఆయన విమర్శించారు. వరంగల్​ జిల్లా నర్సంపేటలో శుక్రవారం  మీడియాతో ఆయన మాట్లాడారు. నిరుద్యోగులను పసన్నం చేసుకునేందుకు బీఆర్ఎస్  నేతలు అవస్థలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. 

‘‘ఉద్యోగం సామాజిక మార్పు. రాష్ట్రంలో 35 శాతం ఉన్న యువత తమకు ఉద్యోగ భద్రత లేకపోవడంతో కేసీఆర్  సర్కారుపై గుర్రుగా ఉన్నారు. మొన్నటి వరకు రాష్ర్టంలో 80 వేల జాబ్​లు మాత్రమే ఖాళీగా ఉన్నాయని చెప్పిన మంత్రులు నేడు దిగొచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అంగీకరించడం వారి వైఖరికి  అద్దం పడుతున్నది. ఓటమి అంచున ఉన్న బీఆర్ఎస్​ మంత్రులు, నాయకులు టీఎస్​పీఎస్సీని ప్రక్షాళన చేసి జాబ్​ క్యాలండర్​ రిలీజ్​ చేస్తామంటున్నా నిరుద్యోగులు నమ్మే పరిస్థితి లేదు. 

ఖాళీలు భర్తీ చేయకపోవడంతో దాదాపు రెండు వందల మంది నిరుద్యోగులు ఆత్మబలిదానాలు చేసుకున్నారు” అని కోదండరాం తెలిపారు. సీఎం కేసీఆర్  ఎన్ని గిమ్మిక్కులు చేసినా బీఆర్ఎస్​ సర్కారును కూల్చివేసేందుకు నిరుద్యోగులంతా ఏకమయ్యారని ఆయన చెప్పారు. కేసీఆర్​ పాలనతో రాష్ట్ర ప్రజలందరూ విసిగిపోయారన్నారు. ఈ సమావేశంలో టీజేఎస్  స్టేట్​ జనరల్​ సెక్రటరీ అంబటి శ్రీనివాస్, నాయకులు సత్యనారాయణ, రాంచందర్​, సుధాకర్​ తదితరులు పాల్గొన్నారు.