నర్సంపేట, వెలుగు: కేంద్రంలో మరోమారు బీజేపీ ప్రభుత్వం వస్తే రాజ్యాంగానికి, దేశానికి ప్రమాదమని టీజేఎస్ చీఫ్, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో అంబటి శ్రీనివాస్అధ్యక్షతన రాజ్యాంగ పరిరక్షణ ప్రజా సదస్సు గురువారం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ దేశ సంపద, వనరులను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్‌శక్తులకు ధారాదత్తం చేస్తోందని మండిపడ్డారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రలను ప్రజలంతా తిప్పికొట్టాలన్నారు. దేశంలో మెజార్టీగా ఉన్న బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లే ఆయుధమని చెప్పారు.
బీజేపీకి ఎలక్టోరల్ బాండ్లు పెద్ద మొత్తంలో వచ్చాయంటే సంపద ఎవరి చేతుల్లో ఉందో, ఎలా వెళ్లిందో ప్రజలంతా అర్థం చేసుకోవాలన్నారు. రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమలు కావాలంటే ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిందిగా పిలుపునిచ్చారు. మహబూబాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ర్ట అధ్యక్షుడు అంబటి నాగయ్య, టీజేఎస్జిల్లాఅధ్యక్షుడు షేక్‌జావీద్, గుంటి రాంచందర్, సాంబరాతి మల్లేశం పాల్గొన్నారు.