బ్యాంక్‌‌లో గోల్డ్‌‌ చోరీ.. ప్రొఫెషనల్‌‌ గ్యాంగ్‍ పనే !

బ్యాంక్‌‌లో గోల్డ్‌‌ చోరీ..  ప్రొఫెషనల్‌‌ గ్యాంగ్‍ పనే !
  • పోయింది 19 కిలోల బంగారం.. విలువ రూ.13.61 కోట్లు
  • నాలుగేళ్ల క్రితం ఇదే బ్యాంకులో చోరీ.. అయినా పెంచని సెక్యూరిటీ
  • కర్నాటక రాష్ట్రం దవనగిరి ఎస్‌‌బీఐలోనూ ఇదే తరహా చోరీ
  • రాయపర్తి ఎస్‍బీఐలో చోరీ ఆ గ్యాంగ్​పనేనని అనుమానాలు
  • ఘటనాస్థలాన్ని పరిశీలించిన వరంగల్‍ సీపీ అంబర్‌‌ కిశోర్‌‌ ఝా

వరంగల్/రాయపర్తి, వెలుగు : వరంగల్‍ జిల్లా రాయపర్తి ఎస్‍బీఐలో దోపిడీ ప్రొఫెషనల్‌‌ గ్యాంగ్‍ పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి గ్యాస్‌‌ కట్టర్‍తో కిటికీ చువ్వలను కట్‍ చేసి లోపలికి ప్రవేశించిన దొంగల ముఠా ఏకంగా 19 కిలోల బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వీటి విలువ రూ.13.61 కోట్ల వరకు ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఘటనాస్థలాన్ని బుధవారం వరంగల్‌‌ పోలీస్‌‌ కమిషనర్‍ అంబర్‍ కిశోర్‌‌ ఝా, బ్యాంక్‍ ఉన్నతాధికారులు సందర్శించారు. 

497 ప్యాకెట్లలోని గోల్డ్ చోరీ

సోమవారం అర్థరాత్రి చోరీ జరుగగా మంగళవారం ఉదయం బ్యాంక్‌‌కు వచ్చిన అధికారులు రూ.10 కోట్ల విలువ చేసే 15 కిలోల బంగారం చోరీ అయినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. కానీ ఆ తర్వాచ పూర్తి స్థాయిలో విచారణ జరుపగా మరో రూ.3.61 కోట్ల విలువైన నాలుగు కిలోల అభరణాల కూడా చోరీ అయినట్టు తేల్చారు. దీంతో మొత్తంగా 19 కిలోలు బంగారం చోరీ అయినట్టు తెలుస్తోంది. రాయపర్తి మండల పరిధిలోని వివిధ గ్రామాలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన దాదాపు 635 మంది రైతులు, వ్యాపారులు తమ అవసరాల కోసం ఇక్కడి ఎస్‍బీఐలో గోల్డ్​పెట్టి లోన్లు తీసుకుంటుంటారు. బ్యాంర్‌‌ లాకర్‍ గదిలోని ఓ ర్యాక్​లో ఉంచిన 497 ప్యాకెట్లలోని బంగారు ఆభరణాలతో పాటు మరో ర్యాక్‍లోని 138 బాక్సుల్లో ఉన్న గోల్డ్‌‌ను దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలిసింది.

నాలుగేండ్ల క్రితం చోరీ జరిగినా..

ప్రస్తుతం దొంగతనం జరిగిన రాయపర్తి ఎస్‌‌బీఐ బ్రాంచ్‌‌లోనే నాలుగేండ్ల కింద కూడా చోరీ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. అప్పుడు బ్యాంక్‌‌ సిబ్బంది విషయాన్ని బయటకు రానివ్వలేదని, చిన్న చోరీ అంటూనే దాదాపు ఐదు నెలలపాటు పోలీస్‍ స్టేషన్‌‌ చుట్టూ తిరిగినట్లు వెల్లడించారు. ఒకసారి దొంగతనం జరిగినా.. సెక్యూరిటీ పెంచకపోవడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. చోరీ విషయం తెలియడంతో రాయపర్తి ఎస్‍బీఐలో గోల్డ్​పెట్టి లోన్‌‌ తీసుకున్న రైతులు రెండు రోజులుగా బ్యాంక్‌‌ వద్దకు వచ్చిపోతున్నారు. ‘మా బంగారం చోరీ అయిందా..’ అంటూ ఆరా తీస్తున్నారు. అధికారులు ఏ సమాచారం ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. 

 కర్నాటకలోని ఓ బ్యాంకులోనూ ఇదే తరహాలో..

వరంగల్‍ జిల్లా రాయపర్తి ఎస్‌‌బీఐలో చోరీ జరిగినట్టుగానే అక్టోబర్‍ 26న కర్నాటకలోని దవనగిరి జిల్లా న్యామతి టౌన్‌‌ ఎస్‍బీఐలోనూ దొంగతనం జరిగింది. అక్కడ కూడా గ్యాస్‍ కట్టర్లతో కిటికీ చువ్వలను కట్​చేసి లోపలికి ప్రవేశించారు. అలారం కేబుల్‌‌ను కట్​చేశారు. గ్యాస్‍ కట్టర్‍తోనే లాకర్‍ తెరిచారు. ఓ లాకర్‍లోని రూ.12 కోట్ల 95 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను చోరీ చేశారు. రాయపర్తి తరహాలోనే అక్కడ కూడా మరో లాకర్‍లో ఉన్న ఆభరణాలను రూ.30 లక్షల నగదును ముట్టుకోలేదు. రెండు ఘటనల్లోనూ సీసీ టీవీ పుటేజ్‌‌లను ఎత్తుకెళ్లారు. దీంతో అదే గ్యాంగ్‌‌ రాయపర్తిలో కూడా చోరీ చేస ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 


విచారణ చేస్తున్నం


రాయపర్తి ఎస్‍బీఐలో సిబ్బంది చెప్పిన ప్రకారం దాదాపు 19 కిలోల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఇది అంతర్రాష్ట్ర దొంగల పనేనని భావిస్తున్నాం. దొంగల ముఠాను పట్టుకునేందుకు స్పెషల్​ టీమ్​లను ఏర్పాటు చేశాం.


– అంబర్‍ కిశోర్‌‌ ఝా, వరంగల్‍ సీపీ-