
బషీర్‌బాగ్, వెలుగు: గత పదేండ్లు ప్రభుత్వానికి ఖాళీగా ఉన్న భూములు మాత్రమే కనిపించాయని, భూమిపై ఉండే మనుషులు కనిపించలేదని పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ తీవ్రంగా విమర్శించారు. మానవీయ తెలంగాణ కావాలనే స్వప్నాన్ని యువతకు అందించలేకపోయారన్నారు. ఆదివారం సాయంత్రం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సీనియర్ జర్నలిస్ట్ కందుకూరి రమేశ్ బాబు రచించిన ‘విను తెలంగాణ’ పుస్తకావిష్కరణకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పాలకులు ప్రజల గుండె చప్పుడు వినాలని సూచించారు.
తెలంగాణ పునర్నిర్మాణ బాధ్యతను ఉద్యమ నేత కోదండరామ్‌కు అప్పగించాలని చెప్పారు. సామాజిక ప్రయోజకత్వం ఉన్న విను తెలంగాణ పుస్తకంపై లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. తన 55 ఏళ్ల పౌర హక్కుల ఉద్యమంలో తనను ఎప్పుడూ అరెస్ట్ చేయలేదని, తెలంగాణ వచ్చాక చిన్నపాటి విద్యా ఉద్యమం చేస్తే అరెస్ట్ చేశారని విచారం వ్యక్తం చేశారు. రచయిత, కవి, దర్శకుడు బి.నరసింగరావు సభకు అధ్యక్షత వహించగా, సీనియర్ జర్నలిస్ట్ రేమిల్ల అవధాని, వీక్షణం సంపాదకుడు ఎన్. వేణుగోపాల్ పాల్గొన్నారు.