
బషీర్‌బాగ్/ఖైరతాబాద్, వెలుగు: ప్రకృతిని, ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని పౌరహక్కుల సంఘం నేత , ప్రొఫెసర్ హరగోపాల్ ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్ బస్తర్ లో జరుగుతున్న ఎన్ కౌంటర్లపై హైదరాబాద్, హైదర్ గూడలో పౌర హక్కుల సంఘం, మానవ హక్కుల వేదిక, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఇందులో హరగోపాల్ పాల్గొని , మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్‌లో ఆపరేషన్ కగార్ పేరిట బూటకపు ఎన్ కౌంటర్లు చేస్తున్నారని ఆరోపించారు. ఆదివాసులని అడవి నుంచి దూరం చేసేందుకే ఈ ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయన్నారు.
ఆదివాసులకు భూమిపై హక్కును రాజ్యాంగం కల్పించిందని.. ఆ హక్కును కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్‌గఢ్ బీజేపీ ప్రభుత్వం కాలరాస్తున్నాయని విమర్శించారు. కార్పొరేట్ శక్తుల అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందాని మండిపడ్డారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మావోయిస్టు రహిత దేశంగా మారుస్తామని మాట్లాడుతున్నారని.. ఇది ప్రజాస్వామ్యానికి , రాజ్యాంగానికి విఘాతమని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఆదివాసుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని సూచించారు. ఇప్పటివరకు జరిగిన ఎన్ కౌంటర్లు అన్ని ప్రభుత్వ హత్యలే అని , ఆపరేషన్ కగార్ హత్యాకాండను వెంటనే నిపిలివేసి, చర్చలు జరపాలని హరగోపాల్ డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ , జయవిద్యాల తదితరులు పాల్గొన్నారు. అలాగే సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో హరగోపాల్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యకు కనీసం 15శాతం నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లక్ష్మీనారాయణ, చక్రధర్‌రావు, రమా మెల్కొటే పాల్గొన్నారు.