ఈ నెల 31న మొగిలిగిద్దకు సీఎం రేవంత్ రెడ్డి

  • రేవంత్ రెడ్డిని కలిసిన ప్రొఫెసర్ హరగోపాల్, గ్రామస్తులు  

షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలంలోని మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాలను ఈ నెల 31న సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ తెలిపారు. సీఎం రేవంత్​రెడ్డిని మొగిలిగిద్ద గ్రామానికి చెందిన ఆయనతోపాటు డాక్టర్ రవీందర్ రెడ్డి, దయాసాగర్, పలువురు గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామ పాఠశాల150 ఏండ్ల ఉత్సవాలకు రావాలని ఆహ్వానించారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించి, తన పర్యటనకు కావలసిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించినట్లు హరగోపాల్ తెలిపారు. 

హెడ్​మాస్టర్​పై దాడి దుర్మార్గం

ముషీరాబాద్: విద్యాబుద్ధులు నేర్పే టీచర్ పై దాడి సరికాదని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశానికి ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి హాజరై మాట్లాడారు. 

తుక్కుగూడ స్కూల్​లో హెచ్ఎం రాములుపై జరిగిన దాడిని ఖండించారు. విద్యార్థి తల్లిదండ్రులతో ఏమాత్రం సంబంధం లేకుండా సుమారు 50 మంది హెడ్మాస్టర్ రాములుపై భౌతిక దాడి చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని అభివర్ణించారు. దాడి చేసిన వారిపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.