- బడుగు, బలహీన వర్గాల కోసం ఆయన పోరాటం మరువలేనిది
- ‘గద్దర్ అన్న యాది’ సభ
జమ్మికుంట, వెలుగు : ప్రజా ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గద్దర్ పాటలు ప్రజల జీవితాల్లో నిత్యం ఉండిపోతాయని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశీం అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ద్రవిడ సంస్కృతిక కళామండలి ఆధ్వర్యంలో ‘గద్దర్ అన్న యాది’ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కాశీం మాట్లాడుతూ గద్దర్ మరణించవచ్చు కానీ, ఆయన పాడిన పాటలు ప్రజల్లో శాశ్వతంగా ఉండిపోతాయని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేకమైన పోరాటాలు చేసిన గొప్ప కళాకారుడు గద్దర్ అని అన్నారు. గద్దర్ పాడిన పాటలు చాలామంది కవులకు, కళాకారులకు మార్గం చూపాయని, 1969 తెలంగాణ ఉద్యమం మొదలుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు గద్దర్ అనేకమైన ప్రజా ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొని తన వంతు పాత్ర పోషించారన్నారు.
నక్సల్ బరి ఉద్యమంలో సైతం కీలక పాత్ర పోషించారని, ఆనాటి కాలంలోనే రాజకీయాలపై ప్రజలకు అర్థమయ్యే భాషలో గజ్జె కట్టి పాటలు పాడుతూ అనేక మందిని విప్లవోద్యమంలో పాల్గొనేలా చేశారన్నారు. రాజకీయ శక్తులు ఎన్ని అడ్డం వచ్చినా వాటిని లెక్కచేయకుండా తాను ఎంచుకున్న లక్ష్యాల వైపు సాగారన్నారు. ప్రజా పోరాటాల ద్వారానే హక్కుల సాధన జరుగుతుందని, ఉద్యమాల ద్వారానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందని నిరూపించిన వ్యక్తి గద్దర్ అన్న అని వెల్లడించారు. విద్యార్థి నాయకుడు శరత్, డాక్టర్ తిరుపతయ్య, భరత్, సామ్రాజ్యం పాల్గొన్నారు.