
- టీజేఎస్ చీఫ్, ఎమ్మెల్సీ
- ప్రొఫెసర్ కోదండరాం ఆరోపణ
నల్గొండ అర్బన్, వెలుగు : ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బుల ప్రభావం ఎక్కువగా కనబడుతుందని, ఓటర్లకు పైసలిచ్చి గెలవాలని చూస్తున్నారని, సామాన్యుడు పోటీ చేసి గెలిచే పరిస్థితి లేదని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. మంగళవారం నల్గొండలోని టీజేఎస్ ఆఫీసు లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడు తూ.. పన్నాల గోపాల్ రెడ్డికి టీజేఎస్ పూర్తి మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా టీచర్స్ ఉద్యమంలో టీజేఎస్ అభ్యర్థి క్రియాశీలకంగా పని చేస్తున్నాడన్నారు.
ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు, విద్యా పరిరక్షణకు, టీజేఎస్ తో కలిసి కృష్ణా జలాలు, గోదావరి జలాల పరిరక్షణ యాత్ర చేపట్టారని గుర్తుచేశారు. ఉద్యమ స్ఫూర్తి, నిజాయితీ, నిబద్ధత కలిగిన వ్యక్తి కౌన్సిల్ లో ఉంటే ఉపాధ్యాయులకు న్యాయం చేస్తాడన్నారు. కొత్త పెన్షన్ విధానం పోయి పాత పద్ధతి రావాలంటే ఉపాధ్యాయ పక్షాన పోరాడే తమ అభ్యర్థిని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పన్నాల గోపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.