తెలంగాణ జన సమితి పార్టీ తరపున మునుగోడు అభ్యర్థిని ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. టీజేఎస్ అభ్యర్థిగా పల్లె వినయ్ కుమార్ గౌడ్ మునుగోడు బరిలోకి దిగుతున్నారని తెలిపారు. చండూరు మండలం బోడంగిపర్తి గ్రామానికి చెందిన వినయ్ కుమార్ గౌడ్ గతంలో సర్పంచిగా పనిచేశాడు. తనపై నమ్మకం ఉంచి మునుగోడు టిక్కెట్ కేటాయించిన కోదండరామ్ కు వినయ్ కుమార్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.
మునుగోడు ఉపఎన్నికకు సంబంధించి ఇవాళ ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు, యుగ తులసి పార్టీ తరఫున మరొకరు నామినేషన్ వేశారు. దీంతో మూడురోజుల్లో దాఖలైన మొత్తం నామినేషన్ల సంఖ్య 23కు చేరింది. అంతకుముందు మొదటి రోజున ఒక నామినేషన్, రెండో రోజున 16 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం రోజున నామినేషన్ దాఖలు చేశారు.
కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి శుక్రవారం నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. మునుగోడు ఉప ఎన్నికకు ఈనెల 14తో నామినేషన్ల దాఖలు గడువు ముగియనుంది. 15న నామినేషన్ల పరిశీలన, 17 వరకు నామినేషన్ల విత్ డ్రాకు ఈసీ గడువు ఇచ్చింది. నవంబర్ 3న పోలింగ్ జరగనుండగా..6న ఫలితం తేలనుంది. మునుగోడు బరిలో పలు పార్టీలున్నా.. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారాన్ని స్పీడప్ చేశాయి.