- ఎమ్మెల్సీ పదవిని బాధ్యతగా భావిస్త
- ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్త
- ఉద్యమ నేతలంతా రాష్ట్రాభివృద్ధికోసం పనిచేయాలని పిలుపు
- త్యాగరాయ గానసభలో ఘనంగా ఆత్మీయ పౌర సన్మానం
ముషీరాబాద్, వెలుగు : ఎమ్మెల్సీ పదవిని బాధ్యతగా భావిస్తానని, ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ, టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని త్యాగరాయగానసభలో టీజేఎస్గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం.నర్సయ్య ఆధ్యర్యంలో కోదండరామ్‌కు ఆత్మీయ పౌర సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉందన్నారు. పదవి అనేది సాధనమే కానీ.. అది అంతిమ లక్ష్యం కాదన్నారు.
ప్రజల కోసం జీవితాలను అంకితం చేసిన రామ్ మనోహర్ లోహియా, కర్పూరి ఠాకూర్, గుమ్మడి నరసయ్య వంటి మహనీయులే తనకు ఆదర్శమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ వర్గాలైతే కలిసివచ్చాయో.. ఆ వర్గాలన్నింటినీ కలుపుకుని రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తానని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ముందు నడిచిన వారంతా ఇప్పుడు తెలంగాణ జన సమితిలో ఉన్నారన్నారు. అందుకే పార్టీ గొప్పగా నిలబడి ముందుకు సాగుతున్నదన్నారు. విలువలకు కట్టుబడి ఉద్యమం నుంచి పని చేస్తూ వస్తున్నామని, ఇక ముందు కూడా అలాగే పనిచేస్తామన్నారు.
రాజకీయాల్లో ఉంటేనే ప్రజల జీవన స్థితిగతుల్లో మార్పు తీసుకురాగలమని నమ్మి టీజేఎస్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఎం.నర్సయ్య మాట్లాడుతూ కోదండరామ్ ను సన్మానించడం అంటే తెలంగాణ సమాజాన్ని, ఉద్యమకారులను సన్మానించడమేనని అన్నారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవం కోసం పనిచేసే కోదండరామ్ ను స న్మానించుకోవడం సంతోషంగా ఉన్నారు. అంతకు ముందు లోయర్ ట్యాంక్ బండ్ వద్ద కట్టమైసమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి ఎన్టీఆర్ స్టేడియం, అశోక్ నగర్, జవహర్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు మీదుగా త్యాగరాయగానసభ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
దారి పొడవునా కళాబృందాల ప్రదర్శన ఆకట్టుకుంది. టీజేఎస్రాష్ట్ర ఉపాధ్యక్షుడు బద్రుద్దీన్, ప్రధాన కార్యదర్శి బట్టల రామచందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ మానేపల్లి లక్ష్మణ్, కోశాధికారి సురేష్ కుమార్, అధికార ప్రతినిధి నాకోటి రవికాంత్, ముషీరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ మెరుగు శ్రీనివాస్ యాదవ్, నగర నాయకులు సయ్యద్ ఇస్మాయిల్, రాజు, సుధాకర్, అజయ్ గౌడ్, రవీందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.