
- దేశంలోనే కాళేశ్వరం పెద్ద స్కాం
- ఇరిగేషన్ ఆఫీసర్లు బ్లాక్ మొత్తం కొత్తగా కట్టాలంటున్నరు
- కేంద్ర నిపుణుల కమిటీకి ఏం తెలుసని సెక్రెటరీ అంటున్నడు
- టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం
- మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన ప్రొఫెసర్
మహదేవపూర్/ నర్సంపేట, వెలుగు : దేశంలో జరిగిన పెద్ద స్కాంలలో కాళేశ్వరం ఒకటని, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు వైట్‌పేపర్ రిలీజ్ చేయకపోవడమే దీనికి నిదర్శనమని టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో కుంగిన మేడిగడ్డ బ్యారేజీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజీ గురించి కేంద్ర నిపుణుల కమిటీలు చెప్పిన విషయాలు తప్పు అని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం అసలు జరిగిన విషయం చెప్పకపోవడం విచిత్రంగా ఉందన్నారు.
బ్యారేజీని పరిశీలించినపుడు ఏడో బ్లాక్ లో 20 పియర్ విరిగిపోయి, వాక్ వే బ్రిడ్జ్ కుంగి, గేట్వంగి పగుళ్లు తేలి కనబడిందన్నారు. ఇరిగేషన్ ఆఫీసర్లు కుంగిన బ్యారేజీ వివరాలు తెలుపుతూ.. బ్లాక్ మొత్తం10 మీటర్ల లోతు నుంచి బేస్ ఏర్పాటు చేసి పిల్లర్లు నిర్మించామని, ఇప్పుడది కుంగడం వల్ల మొత్తం బ్లాక్‌ను కొత్తగా నిర్మించవలసి వస్తుందని చెప్పారన్నారు. సెక్రటరీ మాత్రం.. కేంద్ర నిపుణులు ఏమీ చూడకుండానే నష్టం వాటిల్లిందని చెబుతున్నారని, బ్రిడ్జికి ఉన్న రెండు పలకల మధ్య ఏర్పడిన ఖాళీ స్థలం నుంచి చూస్తే ఏం తెలుస్తుందని ఎద్దేవా చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. లక్షల కోట్లు వృథా చేసిన కారకులను గుర్తించి శిక్షించాలని, జ్యుడీషియరీ కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
విద్యావంతుల వేదిక స్టేట్ ప్రెసిడెంట్ అంబటి నాగయ్య, టీజేఎస్ఉపాధ్యక్షుడు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అబతి శ్రీనివాస్, స్టేట్ ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్, భూపాలపల్లి జిల్లా ప్రెసిడెంట్ రత్నం కిరణ్, విద్యావంతుల వేదిక నర్సంపేట ప్రెసిడెంట్ మల్లేశం పాల్గొన్నారు. అలాగే వరంగల్ జిల్లా నర్సంపేటలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ తుమ్మిడిహట్టి వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఖర్చు తగ్గడంతో పాటు చివరి ఆయకట్టుకు సాగు నీరందే ఛాన్స్ ఉన్నా..దోపిడీ చేయడానికే కాళేశ్వరం దగ్గర ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు. టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబటి శ్రీనివాస్, టీజేఎస్ నాయకులు అర్జున్, రవీందర్, జావీద్ పాల్గొన్నారు.