సూర్యాపేట వెలుగు: సీఎం కేసీఆర్ను గద్దె దింపడమే తమ లక్ష్యమని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. అందుకోసం ఏ పార్టీతోనైనా పొత్తుకు సిద్ధమని ప్రకటించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంతటి విజయ్ గార్డెన్స్ లో ఉన్న కొండేటి వేణుగోపాలరెడ్డి ప్రాంగణంలో నిర్వహించిన టీజేఎస్ మూడో ప్లీనరీ మీటింగ్లో కోదండరాం పాల్గొన్నారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చడం ఒక్క టీజేఎస్ తోనే సాధ్యమన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ శక్తులు, ఉద్యమకారులు ఏకమై రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా కలిసి వచ్చే పార్టీలతో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చకుండానే సొంత ఎజెండాను అమలుపరుస్తోందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల ఉద్యమ నినాదం పక్కదారి పట్టిందని, ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా మారిందని ఆరోపించారు. హక్కులు, న్యాయం కోసం ఉద్యమించిన రైతులను, నిరుద్యోగ యువతను ఈ సర్కారు కేసులు పెట్టి జైలు పాలు చేస్తోందన్నారు. పరీక్షల నిర్వహణ సక్రమంగా లేక పేపర్ల లీకేజీతో 30 లక్షల మంది నిరుద్యోగ యువత భవిష్యత్ ప్రశ్నార్థకమైందన్నారు. భూసేకరణ పేరుతో రైతుల భూమిని లాక్కుంటున్నారన్నారు. చివరకు దళిత, గిరిజనుల భూములను కూడా విడచి పెట్టడం లేదన్నారు. రైతులకు రైతుబంధు పేరు చెప్పి ఇతర ప్రభుత్వ సహకారాలన్నీ నిలిపివేశారన్నారు. రుణమాఫీ చేయకుండా అప్పులపాలు చేశారన్నారు. హక్కుల కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగ సంఘాలను, ఆర్టీసీ కార్మికులను సమ్మె హక్కు లేకుండా అణచివేస్తోందన్నారు. సర్పంచులకు బిల్లులు ఇవ్వకుండా వేధిస్తోందన్నారు.
ఈ పరిస్థితుల మధ్య ప్రజా సమస్యలపై నిరంతరం టీజేఎస్ పోరాడుతూనే ఉందన్నారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానాన్ని ప్రతినిధులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. మరో దఫా పార్టీ అధ్యక్షుడిగా కోదండరాంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్లీనరీలో రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వరరావు, ప్రధాన కార్యదర్శులు అంబటి శ్రీనివాస్, గోపగాని శంకర్రావు, యువజన సమితి రాష్ట్ర అధ్యక్షుడు సలీం పాషా పాల్గొన్నారు.