ఎన్నికల్లో కలిసి వచ్చే పార్టీలతో ముందుకెళ్తాం : ప్రొఫెసర్ కోదండరాం

తెలంగాణ పరిరక్షణకు.. ప్రజాస్వామ్య తెలంగాణకు టీజేఎస్ కృషి చేస్తోందని ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చడం టీజేఎస్ తోనే సాధ్యమన్నారు. తెలంగాణ శక్తులు, ఉద్యమకారులు ఏకమై రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రుణమాఫీ లేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా కలిసి వచ్చే పార్టీలతో  ముందుకు వెళ్తామన్నారు. తెలంగాణ జన సమితి అస్తిత్వాన్ని కాపాడుకుంటామని చెప్పారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర 3వ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ర్ట అధ్యక్షులుగా హాజరైన ప్రొఫెసర్ కోదండరాం.. పార్టీ జెండా ఎగురవేసి ప్లీనరీని ప్రారంభించారు.

తమ ఆర్థిక, రాజకీయ స్వలాభాల కోసమే తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ విధ్వంసం సృష్టిస్తున్నారని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షులు, ప్రొఫెసర్ కోదండరాం వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చకుండానే సొంత ఎజెండాను అమలు పరుస్తోందని ఆరోపించారు. తెలంగాణ పదాన్ని వదిలి.. రాష్ర్ట ప్రజల ఆకాంక్షలను మరిచి.. బీఆర్ఎస్ తో దేశ రాజకీయాల్లోకి వెళ్లడం సరికాదన్నారు. అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే... కనీసం ఆదుకునే ప్రయత్నం చేయకపోవడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. రాష్ర్టంలో పోడు రైతులకు పట్టాలు ఇవ్వడం లేదని, విద్య వైద్యం ఉచితంగా అందడం లేదన్నారు.