- తెలంగాణ వికాసం కోసమే కాంగ్రెస్ కు మద్దతు
- నిరంకుశ పాలన అంతం కాకపోతే తెలంగాణ అభివృద్ధి చెందదు
- తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం
నర్సంపేట (వరంగల్) : కేసీఆర్ దోపిడీ, నిరంకుశ పాలన అంతం కాకపోతే తెలంగాణ అభివృద్ధి చెందదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మంత్రులకు ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేదని, కేసీఆర్ ఏకచక్రాధిపత్యంతో అప్రజాస్వామ్య విధానాలను అవలంబించారని విమర్శించారు. వనరుల దోపిడీ పెరిగిపోయిందని, ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్య ఆందోళనలను సైతం పలు సెక్షన్లతో నిర్బంధాలతో అడ్డుకున్నారని అన్నారు. తుమ్మిడి హట్టి వద్ద కాలేశ్వరం ప్రాజెక్టు కడితే ఖర్చు తగ్గడంతో పాటు చివరి ఆయకట్టుకు సాగునీరు అందే అవకాశం ఉన్న.. తమ దోపిడీ కోసం కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు. 75 వేల కోట్ల అంచనాలతో తయారైన కాలేశ్వరం ప్రాజెక్టులను లక్ష 77 వేల కోట్లకు పెంచి ప్రజాధనాన్ని లూటీ చేశారని ఫైర్ అయ్యారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణ, తెలంగాణ వికాసం కోసం కాంగ్రెస్ పార్టీకి తాము సంపూర్ణ మద్దతు ప్రకటించామని వెల్లడించారు.
రాష్ట్రంలో రాక్షస పాలన అంతమందించేందుకు ప్రజా సంఘాలు, రాజకీయ వ్యక్తులు ఏకం కావలసిన తరుణం ఆసన్నమైందని చెప్పారు. ఇప్పుడు తెలంగాణను కాపాడుకోకపోతే భవిష్యత్ అంధకారంగా మారే ప్రమాదం ఉందని ప్రజలంతా కేసిఆర్ కు బుద్ధి చెప్పాల్సిందిగా పిలుపునిచ్చారు. సమావేశంలో తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబటి శ్రీనివాస్, నాయకులు నాగన్న అర్జున్, రవీందర్, జావీద్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.