
మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కుంగడంపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. ఇటీవల కుంగుబాటుకు గురైన కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ను.. 2023, నవంబర్ 6వ తేదీ సోమవారం కోదండరామ్ సందర్శించారు. ఈ సందర్భంగా వంతెన, కుంగిన పిల్లర్లను ఆయన పరిశీలించారు.
అనంతరం కోదండరామ్ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో జరిగిన కుంభకోణాలల్లో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటి అని అన్నారు.గతంలో నిర్మించిన ఎల్లంపల్లి, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులకు ఏలాంటి డోకా లేదని...కానీ కట్టి నాలుగేళ్లు గడవక ముందే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుతోందని విమర్శించారు.
మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్ లు నిలువడం కష్టమేన్నారు. బ్యారేజ్ కుంగడానికి గల కారణాలను రాష్ట్ర ప్రభుత్వం.. తెలంగాణ సమాజానికి తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. దెబ్బతిన్న ప్రాజెక్టుపై న్యాయ విచారణ చేపట్టి.. భాద్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రజల ధనం దుర్వినియోగం అయిందని... దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి బాధ్యత వహించాలని కోదండరామ్ మండిపడ్డారు.