యువతకు కేసీఆర్​ అన్యాయం చేసిండు : కోదండరాం

  •     టీజేఎస్​ చైర్మన్​ కోదండరాం
  •     ఖమ్మంలో యువజన సింహగర్జన సభ 

ఖమ్మం టౌన్, వెలుగు : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో జీవితాలు మారతాయని కలలు కన్న యువతకు కేసీఆర్ అన్యాయం చేశారని టీజేఎస్ చైర్మన్ ప్రొఫెసర్​ కోదండరాం ఆరోపించారు. ఖమ్మం సిటీలోని ఎస్సార్ కన్వెన్షన్​లో బుధవారం తెలంగాణ యువజన సింహగర్జన సభ నిర్వహించారు. ఇందులో కోదండరాంతో పాటు ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ తుమ్మలకు సంపూర్ణ మద్దతు తెలిపేందుకే ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు.

టీఎస్పీఎస్సీ వైఫల్యం, అవినీతి ప్రభుత్వం వల్ల ప్రవళిక ఆత్మహత్య చేసుకుందన్నారు. యువత భవిష్యత్ నాశనం చేస్తూ..ఊరూరా  బెల్ట్ షాపులు పెట్టి ప్రజలను బానిసలుగా మార్చారని కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి, అరాచక, నియంత కేసీఆర్ పరిపాలనకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ గెలుపుతోనే ప్రజాస్వామిక తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. తుమ్మల మాట్లాడుతూ తెలంగాణ జేఏసీ చైర్మన్​గా ఉద్యమంలో కోదండరాం పాత్ర మరువలేనిదన్నారు.

కోదండరాం పదవుల కోసం పాకులాడే వ్యక్తి కాదని, నిరంతరం తెలంగాణ ప్రయోజనాల కోసం తాపత్రయపడే మేధావి అని చెప్పారు. తర్వాత నిర్వహించిన ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలోనూ తుమ్మల నాగేశ్వరరావు, కోదండరాం పాల్గొని ప్రసంగించారు.