కేయూ రిజిస్ట్రార్​ ఔట్​!

కేయూ రిజిస్ట్రార్​ ఔట్​!

హనుమకొండ, వెలుగు : కాకతీయ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్​లో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. వైస్​ చాన్స్​లర్ ​ప్రొఫెసర్​తాటికొండ రమేశ్​ ఆదేశాల మేరకు అసిస్టెంట్ రిజిస్ట్రార్​ పెండ్లి అశోక్​బాబు పలువురిని బదిలీ చేస్తూ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.  ఇన్ని రోజులు రిజిస్ట్రార్​గా కొనసాగిన రిటైర్డ్​ ప్రొఫెసర్​ శ్రీనివాసరావును ఆ బాధ్యతల నుంచి తొలగించారు. కొత్త రిజిస్ట్రార్​గా ఎగ్జామినేషన్స్​ కంట్రోలర్​గా పనిచేసిన ప్రొఫెసర్ ​మల్లారెడ్డిని నియమించారు. ఎస్​డీఎల్​సీఈ  డైరెక్టర్​ స్థానంలోనూ శ్రీనివాసరావే కొనసాగగా..ఇప్పుడు దూరవిద్యా కేంద్ర సంచాలకుడిగా ప్రొఫెసర్​ వి.రామచంద్రం నియమితులయ్యారు.

యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ కో ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్​గా ఉన్న మల్లారెడ్డి రిజిస్ట్రార్​గా బదిలీకాగా.. ఆ స్థానంలో ప్రొఫెసర్​ ఎం.సదానందానికి బాధ్యతలు ఇచ్చారు. ఎగ్జామినేషన్స్​ కంట్రోలర్​గా కామర్స్​ అండ్​ బిజినెస్​ మేనేజ్​మెంట్ ​ప్రొఫెసర్​ ఎస్​.నరసింహాచారి, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్​మెంట్ ​కాలేజీ ప్రిన్సిపాల్ గా ఆచార్య పి. అమరవేణి నియమితులయ్యారు. సుబేదారిలోని యూనివర్సిటీ పీజీ కాలేజీ ప్రిన్సిపాల్ గా ప్రొఫెసర్​ పి.వరలక్ష్మి, విశ్వవిద్యాలయ వ్యాయామ కళాశాల ప్రిన్సిపాల్ గా డాక్టర్ ఏటీబీటీ ప్రసాద్​ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కొత్తగా నియామకమైన అధికారులకు  బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు.