
- ప్రొఫెసర్ పురుషోత్తం
మిర్యాలగూడ, వెలుగు : వచ్చే ఆదాయం చేసే ఖర్చులపై ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉంటే జీవన ప్రమాణ స్థాయి పెరిగి అభివృద్ధికి దోహదపడుతుందని ప్రొఫెసర్ పురుషోత్తం అన్నారు. సోమవారం మిర్యాలగూడలోని కేఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ ఎస్.ఉపేందర్ అధ్యక్షతన ఐసీఎస్ ఎస్ఆర్ ఆధ్వర్యంలో అర్థశాస్త్ర విభాగంలో ‘గ్రోత్ పొటెన్షియాలిటీస్ ఇన్ తెలంగాణ స్టేట్-ప్రాస్పెక్ట్స్ అండ్ చాలెంజెస్’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా నూతన ఆర్థిక అభివృద్ధి విధానాలు, అంతర్జాతీయ సంబంధాలు, ఆర్థిక సంక్షోభాల తీరుపై ఆయన ప్రసంగించారు. తెలంగాణ ఎకనామిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ ముత్యంరెడ్డి ఆర్థిక విధానాల్లో సోషలిజం మార్కెట్ ఎకానమీ మధ్య వ్యత్యాసం, వాటి ప్రయోజనాలు, సామాన్యుల అభివృద్ధిపై వివరించారు. సదస్సులో నాగార్జున విశ్వవిద్యాలయ విశ్రాంత ప్రొఫెసర్ కోటేశ్వరరావు, తెలంగాణ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ పున్నయ్య, ఓయూ ప్రొఫెసర్ ఎస్.రాములు, సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ విజిటింగ్ ప్రొఫెసర్ ఇంద్రకాంత్ పాల్గొన్నారు.