తెలంగాణలో దశాబ్ద కాలం.. ఓ విషాదం : జి.హరగోపాల్, కోదండరాం

తెలంగాణలో దశాబ్ద కాలం.. ఓ విషాదం : జి.హరగోపాల్, కోదండరాం
  • ప్రొఫెసర్​హరగోపాల్ కామెంట్
  • రాష్ట్రాభివృద్ధే అమరవీరుల త్యాగాలకు అసలైన ఫలితం

గండిపేట, వెలుగు: తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని ప్రొఫెసర్లు జి.హరగోపాల్, కోదండరాం పిలుపునిచ్చారు. యూనివర్సిటీలు బాగున్నప్పుడే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని చెప్పారు. పీజేటీఎస్‌ఏయూ తెలంగాణ వ్యవసాయ శాస్త్రవేత్తల సంఘం(టాసా), బోధ నేతర సిబ్బంది సంఘం ఆధ్వర్యంలో శనివారం ప్రొఫెసర్​జయశంకర్​వ్యవసాయ యూనివర్సిటీ ఆడిటోరియంలో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించారు. హరగోపాల్, కోదండరాం ముఖ్యఅతిథిలుగా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. తెలంగాణలో దశాబ్ద కాలం ఓ విషాదంగా మిగిలిపోయిందన్నారు. కాంగ్రెస్​ప్రభుత్వం వచ్చాక..  ఇప్పుడే తెలంగాణ  వచ్చినట్లు అనిపిస్తుందని చెప్పారు. పౌర సమాజం, యూనివర్సిటీలు చైతన్యవంతంగా ఉండాలన్నారు. ప్రభుత్వాలు నిరంతరం ప్రజలతో చర్చలు సాగిస్తుండాలని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ అభివృద్ధికి, హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములు పరిరక్షణకు కమిషన్లు వేయాలని గడిచిన పదేండ్లలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​కు సూచించినా పట్టించుకోలేదన్నారు. 

తెలంగాణకు విత్తన బాంఢాగారం అనే పేరు ఉన్నప్పటికీ సన్న, చిన్న కారు రైతులకి మేలు చేసే విధంగా గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. కొత్త ప్రభుత్వం చర్చలు, సంప్రదింపులకు తలుపులు తెరవడం హర్షణీయమన్నారు. ఈ అవకాశాన్ని రైతుల వినియోగించుకోవాలన్నారు. యూనివర్సిటీలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అందరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ పి.రఘురామిరెడ్డి, టాసా అధ్యక్షుడు డాక్టర్ విద్యాసాగర్, బోధనేతర సిబ్బంది సంఘం నాయకులు శ్రీనివాస్ యాదవ్, డాక్టర్ వనమాల, ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె డాక్టర్ జి.వి.వెన్నెల మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను, ఉద్యమ కాలంలో చురుకుగా పనిచేసిన పూర్వ అధ్యాపకులను, విలేకర్లను సన్మానించారు.