ఏడు దశాబ్దాల తన్లాట, ఎందరో బిడ్డల త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు పెట్టుకున్న ఆశల్లో ఒక్కటి కూడా తీరలేదు. కేసీఆర్ పరిపాలన సీమాంధ్ర పాలన తరీఖానే ఉన్నది. కేసీఆర్ మన రాజ్యాంగాన్ని పక్కకుపెట్టి ఫ్యూడల్ దొరల పద్ధతిల పాలన చేయాలనుకుంటున్నరు. తెలంగాణ కోసం కొట్లాడినవాళ్లెవరూ దీనిని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను, కల్పించిన సమానత్వాన్నీ కోల్పోడానికి రెడీగా లేరు. సొంత రాష్ట్రం వచ్చి తెలంగాణ బిడ్డలే పరిపాలిస్తే, రాష్ట్రంలో డెవలప్‌మెంట్ అంతా పబ్లిక్ సెంట్రిక్‌గా ఉంటదని ఆశించినం. పాలసీలన్నీ ప్రజల కోసమే ఉంటాయని అనుకున్నం. సర్కారు ఖర్చు పెట్టే ప్రతిపైసలో ప్రజలకు వాటా దక్కాలని కోరుకున్నం. సోషల్, ఎకనామికల్, కల్చరల్, వెల్ఫేర్… అన్ని రంగాల్లోనూ డెవలప్‌మెంట్ ఉంటుందని నమ్మినం. కేసీఆర్ సర్కారు అన్ని ఆశలను దెబ్బతీసింది.
ఎన్నికల్ల గెల్వాలంటే పైసలు జల్లాలె. ప్రతిపక్షాలను అడ్రస్ లేకుండా జేయాలె… ఈ పాలసీతో టీఆర్‌ఎస్ రాజకీయాలను పూర్తిగా దిగజార్చింది. కేసీఆర్ గేమ్‌ల ప్రతిపక్షపార్టీలు పూర్తిగా వీక్ అయినయ్. దండిగ పైసలుండి, రాజకీయాలు చేసెటోళ్లే ముఖ్యమయిన్రు. ఈ లీడర్లంతా తమ ఆర్ధిక ప్రయోజనాల కోసం బట్టలు మార్చినట్టు పార్టీలు మారుస్తున్నరు. బిజినెస్‌లు, కాంట్రాక్టులు, రియల్‌ఎస్టేట్, ఏదో చేయాలె పైసలు సంపాదించాలె.. ఇదే వారికి ప్రధానం. వాళ్లకు ప్రజలు కనిపించరు. ప్రజల సమస్యలను పరిష్కరించాలన్న ఆలోచన ఉండదు. డెమొక్రసీ అనేది లేదు. పౌరుల హక్కులకు రక్షణ లేదు. పరిపాలనలో జవాబుదారీతనమే లేకుండా పోయింది. రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన సిస్టమ్స్‌ను సొంత రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. పోలీసు యంత్రాంగం తమ రూల్స్‌ను తామే పక్కనబెట్టి, చట్టాన్ని బేఖాతరు చేస్తూ, అధికార పార్టీకి ఊడిగం చేస్తున్నది. కాంట్రాక్టర్లకు, బిజినెస్ పీపుల్‌కి బెనిఫిట్ చేసేందుకు పాలసీలను తయారు చేస్తున్నరు. పబ్లిక్ ఇష్యూస్‌ను పట్టించుకునే దిక్కులేదు. ప్రభుత్వ పాలసీల వల్లనే ఇదివరకెన్నడూ లేని ఆర్ధిక సంక్షోభాన్ని మనం చూస్తున్నాం. తెలంగాణ ఏర్పడిన తరువాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం సుమారు 1,13,000 కోట్ల రూపాయల అప్పుచేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది.
తెలంగాణల వందేళ్ల నుంచి ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమానత్వం కోసం పోరాటాలు జరుగుతున్నయి. ఈ పోరాటాలకు వారసులుగా ఉన్నవాళ్లు జేఏసీ లోపలా బయటా ఉంటూ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన్రు. తెలంగాణ వచ్చినాంక, కేసీఆర్ ప్రజావ్యతిరేక పాలన మీద కొట్లాడేందుకు అందరూ కలిసీ తెలంగాణ జనసమితిగా ఏర్పడ్డరు. కేసీఆర్ పాలనతోని తెలంగాణ ఎటూగాని పరిస్థితుల్ల పడింది. రాజకీయంగా సంక్షోభం ఉంది. ఈ విషయాలను అర్థం చేసుకొని టీఆర్‌ఎస్ ప్రభుత్వంతో పోరాటం జేసేందుకు పక్కా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
దేశ పరిస్థితులు కూడా ఏం బాగాలేవు. 1967 తర్వాత ఇవ్వాళ మళ్ళీ అన్‌ఎంప్లాయ్‌మెంట్ తీవ్రమైంది. ప్రజల జీవన ప్రమాణాలు నానాటికీ దిగజారిపోతున్నాయి, ఖర్చులు పెరుగుతున్నాయి, పంటల ధరలు పడిపోతున్నాయి. ఈ పరిస్థితి నుంచి తమను కాపాడాలని, తమకు న్యాయం జేయాలని రైతులు ఆందోళన జేస్తున్నరు. ప్రజలు, ముఖ్యంగా బడుగు, బలహీన, మైనార్టీల ప్రజల జీవనం దుర్భరంగా మారింది. జాతీయస్థాయిలో ప్రజలకు నష్టం కలిగించే విధానాలపై కూడా తెలంగాణ కొట్లాడుతదని అనుకున్నం. టీఆర్‌ఎస్ గవర్నమెంట్ ఎవరికేమయితే నాకేందన్నట్టు మహామౌనం పాటిస్తున్నది. పార్లమెంటులోనూ ఇతరత్రా వేదికలపైనా ఎక్కడా మాట్లాడ్తలేదు. ఇది మన రాష్ట్రానికి మంచిది గాదు.
ఈ పరిస్థితుల్లో ప్రజల తరఫున కొట్లాడేందుకు తెలంగాణ జనసమితి గట్టిగ నిలబడుతున్నది. ఇంటర్ విద్యార్థుల సమస్య, ధర్నాచౌక్ పరిరక్షణ , భూనిర్వాసితుల ఆందోళన, భూప్రక్షాళన బాధితుల సమస్య, ఆదివాసీ పోడు సమస్య, కమిషన్ల కోసమే రీడిజైను చేసి ప్రజాధనాన్ని పెద్దఎత్తున దోపిడీ చేస్తున్న ప్రాజెక్టులు.. ఇలా ప్రజాస్వామ్య విధానాలకు, ప్రజల హక్కులకు భంగం కలిగే ప్రతి ఇష్యూలోనూ జన సమితి డైరెక్ట్ యాక్షన్‌లో ఉంటున్నది. టీఆర్‌ఎస్ అప్రజాస్వామిక పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్నది. ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం పనిచేస్తున్నది. ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం, ప్రజలు కేంద్రంగా ఉండే రాజకీయాల కోసం ఒక పెద్ద ప్రజా ఉద్యమాన్ని నిర్మించే పనిలో వున్నది. అందుకు అవసరమైన వ్యూహాల రూపకల్పన కోసమే ప్లీనరీని నిర్వహిస్తున్నాం.
జై తెలంగాణ!
(పార్టీ మొదటి ప్లీనరీ ఈ నెల 13 శనివారం, హైదరాబాద్‌లోని నాగోల్ లో జరగనున్న సందర్భంగా)
ప్రొ.ఎం. కోదండరాం
తెలంగాణ జనసమతి అధ్యక్షుడు