- ఈ నెల జీతంతో పండుగ అడ్వాన్సుగా ఒక్కొక్కరికి రూ.25 వేలు
- కాంట్రాక్టు కార్మికులకూ బోనస్ చెల్లింపుపై విధివిధానాలు
- అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం సింగ రేణి కార్మికులకు ఇటీవల ప్రకటించిన 33 శాతం లాభాల వాటా బోనస్ ను వచ్చే నెల 9న చెల్లించేందుకు యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. అమెరికా పర్యటనలో ఉన్న సింగరేణి సీఎండీ బలరామ్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంస్థ డైరెక్టర్లు, అన్ని ఏరియాల జీఎంలు, కార్పొరేట్ జీఎంలతో సమావేశం నిర్వహించి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రివర్గం గత వార్షిక సంవత్సరంలో సాధించిన నికర లాభాల్లో 33 శాతం (సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా రూ.796 కోట్ల లాభాల వాటా) ను బోనస్‌గా ప్రకటించింది.
సంస్థలో పనిచేస్తున్న దాదాపు 42 వేల మంది అధికారులు, కార్మికులకు ఈ లాభాల వాటాను పంపిణీ చేయనున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో వారు పనిచేసిన పనిదినాల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని లాభాల వాటా బోనస్ చెల్లిస్తారు. సగటున ఒక్కొక్కరు దాదాపు రూ.లక్షా తొంభై వేల చొప్పున బోనస్ పొందే అవకాశం ఉంది.
తొలిసారిగా కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా
సింగరేణిలో పనిచేస్తున్న దాదాపు 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా లాభాల వాటా బోనస్ చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో దీని కోసం విధి విధానాలను రూపొందించాలని సీఎండీ ఎన్ బలరామ్ అధికారులను ఆదేశించారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా పండుగకు ముందే వారికి కూడా బోనస్ చెల్లింపు జరిగేలా చూడాలని సీఎండీ స్పష్టం చేశారు. ఇక లాభాల వాటా బోనస్ తో పాటు సింగరేణి సంస్థ ఎప్పటిలాగే దసరా పండుగ అడ్వాన్స్ ను ఉద్యోగులకు చెల్లించాలని సీఎండీ ఆదేశించారు. దీంతో ఒక్కొక్కరికి రూ.25 వేలు పండుగ అడ్వాన్స్ చెల్లించనున్నారు. ఇందు కోసం రూ.95 కోట్లను కేటాయించామని సీఎండీ తెలిపారు. ఈ నేపథ్యంలో లాభాల వాటా బోనస్, పండుగ అడ్వాన్సులు కలిపి దాదాపు రూ.900 కోట్లు సింగరేణి ఉద్యోగులకు చెల్లించనున్నారు.