వాణిజ్య పంటగా మిరప సాగుకు పెట్టింది పేరు. మిరప కోసం అధిక విస్తీర్ణంలో ఈ పంటను సాగుచేస్తున్నారు. అయితే ఇటు కూరగాయల పంట పచ్చిమిర్చి కోసం రైతులు సంవత్సరం పొడవునా ఈ పంట పండిస్తున్నారు. ఎండు మిర్చి పంట 2 నుండి 5 కోతల్లో పూర్తవుతుండగా, పచ్చి మిర్చిలో 15 నుండి 20 కోతలు తీస్తున్నారు. ఏడాది పొడవునా సాగులో వుండే కూరగాయ పచ్చిమిరప. వాణిజ్య సరళిలో ఎండు మిరపను ఖరీఫ్, రబీకాలాల్లో నాటితే, పచ్చిమిరపను అన్నికాలాల్లోను సాగుచేస్తున్నారు. అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలు అందుబాటువల్ల రైతులు ఎకరాకు 35 నుండి 50 టన్నుల దిగుబడి తీసే అవకాశం ఏర్పడింది. చాలా మంది పచ్చిమిర్చి సాగుచేస్తూ.. మంచి లాభాలను గడిస్తున్నారు.
నాలుగు నెలల్లోనే ఓ రైతు జీవితాన్ని మార్చేసింది పచ్చిమిర్చి. మరాఠ్వాడాలో రైతులు కరువుతో అల్లాడిపోతారు. హింగోలి జిల్లాలోని సోడెగావ్‌లో నివసిస్తున్న నాగేష్ డోకే అనే రైతు ఆ గ్రామ ప్రజలకు ఆదర్శంగా నిలిచాడు. ఎకరం భూమిలో పచ్చిమిర్చి సాగు చేసి నాలుగు నెలల్లోనే రూ. 8 లక్షలు సంపాదించాడు. గతంలో సంపాదించిన కంటె నాలుగు రెట్లు అధికంగా సంపాదించాడు. వచ్చే రెండు నెలల వరకు పచ్చిమిర్చి ధర ఇలాగే ఉంటే ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుందని చెబుతున్నాడు రైతు నాగేష్.
గతంలో తన పొలంలో సోయాబీన్, పసుపు పంటలను పండించేవాడు. అయితే కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయంలో నష్టం రావడంతో.. ఈ ఏడాది కొత్తగా ఏదైనా చేయాలనుకుని.. పచ్చిమిర్చి పంటను సాగు చేశాడు. పంట అధిక దిగుబడి రావడం.. మంచి ధర పలకడంతో పచ్చిమిర్చి పంట ద్వారా లక్షల రూపాయిలు సంపాదించాడు. జనవరి నెల నుంచి ఏప్రిల్ వరకు రూ. 8 లక్షలు ఆదాయం వచ్చినట్లు ఆయన తెలిపాడు.
సమ్మర్ సీజన్ లో మరాఠ్వాడాలో 42 డిగ్రీలకంటె ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ సమయంలో మిర్చి పంటను సాగు చేయరు. అందుకే ఈ సమయంలో మిర్చిధర అధికంగా ఉంటుంది... ఈ సమయంలో మిర్చి రైతులకు ఆదాయం కూడా బాగానే ఉంటుంది, అయితే 15 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు మిర్చిపంటను సాగు చేయవచ్చు. ఎండా రోజుల్లో కూడా పంట బాగా పండేందుకు నాటుకు ముందు, తర్వాత కొన్ని ప్రత్యేక చిట్కాలు పాటించారు రైతు నగేష్. నాటిన తర్వాత నాగలితో ఒకసారి దున్నాడు. ఆ తర్వాత కల్టివేటర్‌తో పొలాన్ని రెండుసార్లు చదును చేశారు. మిరప మొక్కలకు నీరు, ఎరువులు అందించేందుకు డ్రిప్‌ను వినియోగించారు. ఆ తర్వాత మొక్కలు నాటాడు. సూర్యోదయం ప్రారంభం కాగానే రాత్రి పూట మిర్చి మొక్కలకు ఎరువులు, నీళ్లు పోయడం ప్రారంభించాడు. నగేష్ అదే టెక్నిక్‌ని అనుసరించి రోజూ రెండు క్వింటాళ్ల మిర్చిని ఉత్పత్తి చేశాడు. మిర్చి కిలో రూ.70 వరకు మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు ఎకరంన్నర పొలంలో నాటేందుకు దాదాపు రూ.1.5 లక్షల వరకు ఖర్చు అయిందని తెలిపాడు. రైతు నగేష్ తెలిపిన వివరాల ప్రకారం ఎండా కాలంలో మిర్చి మొక్కలకు రాత్రి పూట ఎరువులు, నీరు అందిస్తే మిర్చి మొక్కలు పచ్చగా ఉంటాయి.
పచ్చిమిర్చి రేటు బాగున్నప్పుడు కొంత మంది రైతులు, మొదట వచ్చిన కాయలను మార్కెట్ చేసి, మిగతా పంటను ఎండు మిరప కోసం వదులుతున్నారు. ఇది రైతుకు కొంత కలిసొచ్చే అంశం. పచ్చిమిరపలో ప్రస్థుతం అధిక దిగుబడినిచ్చే అనేక హైబ్రిడ్ రకాలు రైతులకు అందుబాటులో ఉండటం వలన .. రైతులు ప్రతి ఏటా పచ్చిమిర్చిని సాగుచేసి మంచి దిగుబడులను తీస్తున్నారు.