- ఆర్థిక సంవత్సరం ముగిసి రెండు నెలలైనా ప్రకటించని సంస్థ
- 2023-24 లో రికార్డు స్థాయిలో బిజినెస్ చేసిన సింగరేణి
- గతేడాది 32 శాతం వాటా.. ప్రస్తుతం 35 ఇవ్వాలంటున్న కార్మికులు
కోల్‌బెల్ట్, వెలుగు : సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరం సాధించిన లాభాల ప్రకటన కోసం కార్మికులు ఎదురుచూస్తున్నారు. సంస్థ సాధించిన లాభాల్లో కొంత వాటా కార్మికులకుసైతం పంపిణీ చేసే అవకాశం ఉండడంతో ఎప్పుడు ప్రకటన వస్తుందా ? అని వారిలో ఆసక్తి నెలకొంది. 2023- – 24 ఆర్థిక సంవత్సరం ముగిసి రెండు నెలలు దాటుతున్నా లాభాలపై సింగరేణి యాజమాన్యం నుంచి ఎలాంటి ప్రకటన రావడం లేదు.
2022- – 23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,222 కోట్ల లాభాలను సాధించిన సంస్థ 2023– 24 ఆర్థిక సంవత్సరంలో బొగ్గును భారీ స్థాయిలో ఉత్పత్తి చేసింది. సంస్థ చరిత్రలోనే అత్యధికంగా 70.02 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి, రవాణా చేసి రికార్డును సొంతం చేసుకుంది. దీంతో ఈ సంవత్సరం వచ్చే లాభాలపై కార్మికులు భారీ అంచనాలతో ఉన్నారు.
రూ.37 వేల కోట్ల బిజినెస్
గత ఆర్థిక సంవత్సరంలో రూ.37 వేల కోట్ల బిజినెస్ జరిగినట్లు సింగరేణి ప్రకటించడంతో ఈ దఫా లాభాలు భారీగా వస్తాయని అంచనా వేస్తున్నారు. 2022 - – 23 సంవత్సరంలో 67.13 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి రూ. 33 వేల కోట్ల బిజినెస్ చేయడంతో రూ. 2,222 కోట్ల లాభం వచ్చింది. 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో 70.02 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణాతో రూ. 37 వేల కోట్ల బిజినెస్ జరిగింది. బొగ్గు ఉత్పత్తి పెరగడంతో పాటు బిజినెస్ కూడా ఎక్కువగానే సాగడంతో లాభాలు సైతం భారీగానే వచ్చే అవకాశం ఉంది. కానీ లాభాల విషయాన్ని సింగరేణి యాజమాన్యం ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.
ఆర్థిక సంవత్సరం ముగిసి రెండు నెలలు దాటినా సింగరేణికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు కొలిక్కి రాలేదు. ఇతర సంస్థలన్నీ ఆర్థిక సంవత్సరం ముగిసిన వెంటనే లాభాలను ప్రకటిస్తాయి. సింగరేణికి వచ్చే సరికే లాభాల లెక్కలు నెలల తరబడి సాగుతున్నాయి. దీంతో ప్రతి సంవత్సరం లాభాలను ప్రకటించడంలో ఆలస్యమవుతోంది. సింగరేణికి సంబంధించిన ఆడిట్‌ను వేగంగా పూర్తి చేసి లాభాల వాటాను త్వరగా ప్రకటించాలని కార్మికులు కోరుతున్నారు.
35 శాతం ఇవ్వాలని డిమాండ్
సింగరేణి 2022 – 23 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాల్లో 32 శాతం వాటాను కార్మికులకు చెల్లించింది. కానీ ఈ సారి 35 శాతం వాటా ఇవ్వాలని కార్మికులు, కార్మిక సంఘాల లీడర్లు డిమాండ్ చేస్తున్నారు. ఏటా ఒకటి, రెండు శాతం లాభాల వాటాను పెంచుకుంటూ వస్తున్న యాజమాన్యం ఈ సారి కూడా పెంచుతుందని ఆశిస్తున్నారు.
గతేడాది రూ.37 వేల కోట్ల వ్యాపారం చేసినట్లు సింగరేణి ప్రకటించగా ఇందులో బొగ్గు అమ్మకాల ద్వారా రూ.32,500 కోట్లు, విద్యుత్ అమ్మకాల ద్వారా రూ.4,500 కోట్లు వచ్చినట్లు సంస్థ ప్రకటించింది. ఈ సంవత్సరం సుమారు రూ.3 వేల కోట్ల వరకు లాభాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.
కార్మికుల వాటా ఖరారు చేయనున్న సర్కార్
సింగరేణి ప్రతియేటా ఆర్జించే లాభాలను ప్రకటించి రిపోర్ట్‌ను రాష్ట్ర సర్కార్‌కు పంపిస్తుంటారు. లాభాల్లో కార్మికులకు వాటాను సీఎం ఖరారు చేస్తారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ముగియడంతో సీఎం రేవంత్‌రెడ్డి ద్వారా లాభాల ప్రకటన చేస్తారని కార్మికులు ఎదురుచూస్తున్నారు. సింగరేణి సీఎండీ ఎన్.బలరాంనాయక్ స్వతహాగా ఫైనాన్స్ డైరెక్టర్ కావడంతో లాభాల వాటాపై ప్రత్యేక దృష్టి సారించారు. సింగరేణి వార్షిక టర్నోవర్, లాభాలను తేల్చేందుకు ఇంటర్నల్ ఆడిట్ నిర్వహిస్తుండడం, స్టాట్యుటరీ ఆడిట్ ద్వారా వెరిఫై కూడా కొనసాగుతున్నట్లు సమాచారం.
కార్మికులకు 35 శాతం వాటా ఇవ్వాలి
సింగరేణి కార్మికులు లాభాల వాటా కోసం ఎదురుచూస్తున్నరు. ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటికీ వచ్చిన లాభాలను సంస్థ అధికారికంగా ప్రకటించలేదు. గత ఆర్థిక సంవత్సరం బొగ్గు ఉత్పత్తి, రవాణా, బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది. లాభాల్లో కార్మికులకు 35 శాతం వాటాను ప్రకటించి ఈ నెలలోనే చెల్లించాలి.
- వాసిరెడ్డి సీతారామయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు