- పోలీసుల అదుపులో ఆరుగురు నిందితులు
సికింద్రాబాద్, వెలుగు: సినీ నిర్మాత అంజిరెడ్డి (71) హత్య కేసులో గోపాలపురం పోలీసులు పురోగతి సాధించారు. హత్యకు పాల్పడిన ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఆస్తిపై కన్నేసిన సన్నిహితుడు రాజేశ్ అనే వ్యక్తి బిహారీ గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చి ముందస్తు ప్లాన్ప్రకారం హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
విదేశాల్లో స్థిరపడాలని భావించిన అంజిరెడ్డి ఇక్కడున్న ఆస్తులను అమ్మేసేందుకు ప్రయత్నించగా.. అతడిని నమ్మించి హత్య చేయించి రోడ్డు యాక్సిడెంట్‌గా చిత్రీకరించేందుకు ప్రయత్నించి చివరకు రాజేష్ పోలీసులకు చిక్కాడు. సీసీ కెమెరా ఫుటేజీలు, టెక్నాలజీ ఆధారాలతో అంజిరెడ్డిది హత్యగా తేల్చారు. రవి, రాజేశ్, అతని భార్య, డ్రైవర్, మరో ఇద్దరు బిహారీలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని గోపాలపురం పోలీసులు వెల్లడించారు.