ఇంజెక్షన్ మర్డర్ మిస్టరీ వీడింది

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇంజక్షన్​ మర్డర్ ఇష్యూలో మిస్టరీ వీడింది. కీలక సూత్రధారులు, పాత్రధారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని వల్లభి గ్రామం వద్ద సూది మందు ఇచ్చి షేక్ జమాల్ సాహెబ్​ ​(48) అనే వ్యక్తిని హత్య చేసిన ఘటనలో  నామవరానికి చెందిన  గోదా మోహన్ రావు, నరసింహ శెట్టి వెంకటేశ్వర్లు, బండి వెంకట్ (ఆర్ఎంపీ)లను అనుమానితులుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వీరిని విచారిస్తున్నారు. మరో అనుమానితుడిని చింతకాని మండలం నామవరంలో అదుపులోకి తీసుకుంటుండగా పరారయ్యాడని అంటున్నారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతోనే షేక్ జమాల్ ​సాహెబ్ ను గోదా మోహన్ రావు ప్లాన్ ప్రకారం హత్య చేయించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

లిఫ్ట్ అడిగి, బైక్ ఎక్కాక..

చింతకాని మండలం బొప్పారం గ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై ఏపీలోని తన కుమార్తె ఇంటికి సోమవారం ఉదయం వెళ్తున్న జమాల్ సాహెబ్ ను లిఫ్ట్ అడిగి, బైక్ ఎక్కాక సూది పొడిచిన వ్యక్తిని నరసింహ శెట్టి వెంకటేశ్వర్లుగా గుర్తించారు. నరసింహ శెట్టి వెంకటేశ్వర్లు , గోదా మోహన్ రావు ఇద్దరూ నామవరం గ్రామస్తులేనని చెప్పారు.  జమాల్ ను హత్య చేసేందుకు ఇంజెక్షన్ ఇవ్వాలని సలహా ఇచ్చినట్టుగా భావిస్తున్న  నామవరం గ్రామానికే చెందిన ఆర్ఎంపీ బండి వెంకట్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  వైద్యం ముసుగులో తమ ఊరి పరువు తీసిన వారిని ఎన్ కౌంటర్ చేయాలని నామవరం గ్రామస్థులు కోరుతున్నారు.ఖమ్మం రూరల్ ఏసీపీ బసవ రెడ్డి సారథ్యంలో పోలీసులు కేసు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. 

మోహన్ రావు, జమాల్ మధ్య గొడవ తర్వాత..

గోదా మోహన్​ రావుతో మృతుడు షేక్ జమాల్ సాహెబ్ భార్యకు వివాహేతర సంబంధం నేపథ్యంలో ఒకట్రెండు సార్లు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయని పోలీసులు అంటున్నారు. మోహన్​ రావు, జమాల్ సాహెబ్​ మధ్య కూడా ఇటీవల గొడవ జరిగిందని, దీంతో జమాల్ సాహెబ్​ ను చంపాలని మోహన్​ రావు భావించాడని అనుకుంటున్నారు. ఈక్రమంలోనే నామవరంలో ఒక  ఆర్ఎంపీ ​ దగ్గర సలహాలు తీసుకొని.. మోహన్ రావు, అతడి ఫ్రెండ్ నరసింహ శెట్టి వెంకటేశ్వర్లు తో కలిసి ఈ మర్డర్​ చేసినట్టు ప్రచారం జరిగింది.