365 బీ నేషనల్​హైవే అలైన్​మెంట్​ మార్పు ఉన్నట్టా లేనట్టా?

365 బీ నేషనల్​హైవే అలైన్​మెంట్​ మార్పు ఉన్నట్టా లేనట్టా?
  • పాత పద్దతిలో ప్రతిపాదనలు ఖరారు చేస్తున్న అధికారులు
  • ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రారంభం కాని సర్వే
  • విలువైన భూములు కోల్పోతామంటున్న రైతులు

సిద్దిపేట, వెలుగు: దుద్దెడ నుంచి సిరిసిల్ల వరకు 365 బీ నేషనల్​హైవే ఎక్స్​టెన్షన్​కి సంబంధించిన అలైన్​మెంట్​మార్పుపై ఎలాంటి ముందడుగు పడడంలేదు. మొత్తం 54 కిలో మీటర్ల హైవే నిర్మాణాన్ని రెండు ప్యాకేజీలుగా విభజించి పనులు చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. దుద్దెడ నుంచి రామంచ వరకు 27 కిలోమీటర్లు మొదటి ప్యాకేజీ కింద, రామంచ నుంచి సిరిసిల్ల వరకు 27 కిలోమీటర్ల దూరాన్ని రెండో ప్యాకేజీ కింద విభజించారు. మొదటి ప్యాకేజీ కింద హైవే నిర్మాణానికి 30 ఎకరాల భూసేకరణ చేయాలి. 

ఈ నేపథ్యంలో హైవే ఎక్స్ టెన్షన్​అలైన్​మెంట్​మార్చాలనే డిమాండ్ పై ఎంపీ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ తో పాటు ఏడు గ్రామాల ప్రజలతో సిద్దిపేట కలెక్టరేట్​లో సమావేశాన్ని నిర్వహించారు. భూసేకరణ అవసరం లేకుండా మూడు ప్రత్యామ్నాయ మార్గాలను ప్రతిపాదించి సర్వే చేయాలని సూచించారు. కానీ ఆ దిశగా పనులు జరగడం లేదు. 

150 ఫీట్లతో ఫోర్ లైన్​

దుద్దెడ నుంచి సిరిసిల్ల వరకు 54 కిలోమీటర్ల మేర 365 బీ నేషనల్​హైవేను 150 ఫీట్ల వెడల్పుతో విస్తరించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 54 కిలోమీటర్లలో 36 కిలోమీటర్లు కొత్తగా రోడ్డు వేస్తుండగా మిగిలిన 18 కిలోమీటర్లు ఉన్న రోడ్డునే విస్తరిస్తారు. సిద్దిపేట నుంచి సిరిసిల్ల వరకు 35 కిలోమీటర్ల దూరంలో 25 డేంజర్ మలుపులు ఉన్నాయి. వీటి వద్ద తరచు ప్రమాదాలు జరుగుతుండడంతో కేంద్రం ఎక్స్ టెన్షన్ కు అవకాశం ఇచ్చింది. దీనికి సంబంధించి అధికారులు డీపీఆర్ ను సిద్ధంచేసి ఒక అలైన్​మెంట్​ప్రతిపాదనలు చేయగా  రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 

విలువైన భూములు కోల్పోవద్దనే.. 

దుద్దెడ నుంచి రామంచ వరకు మొదటి ప్యాకేజీ కింద విస్తరించే నేషనల్ హైవే కోసం ఏడు గ్రామాల పరిధిలో 30 ఎకరాల భూసేకరణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో విలువైన భూములు కోల్పోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనగామ నుంచి దుద్దెడ క్రాసింగ్​వరకు నేషనల్​హైవే పనులు పూర్తి కాగా అక్కడి నుంచి ఎక్స్ టెన్షన్ పనుల పైనే సమస్య ఏర్పడింది. 

Also Read :- ట్రాఫిక్ ​రూల్స్ ​బ్రేక్.. రూ.12.24 కోట్ల ఫైన్

దుద్దెడ నుంచి మర్పడ్గ, ఘనపూర్, ఎన్సాన్​పల్లి, బూర్గుపల్లి, చిన్నగుండవెల్లి, జక్కాపూర్ మీదుగా హైవే ఎక్స్ టెన్షన్ కు అధికారులు ప్రతిపాదించారు. ఇక్కడ రైతుల నుంచి భూ సేకరణ చేయాల్సి రావడంతో అలైన్​మెంట్​మార్పును ప్రతిపాదించారు. కానీ దీనిపై ఎలాంటీ ప్రగతి కనిపించకపోవడంతో అధికారులు పాత అలైన్​మెంట్​ప్రకారమే పనులు చేయడానికి సిద్ధమవుతున్నారు.

మూడు ప్రత్యామ్నాయ మార్గాల ప్రతిపాదన

దుద్దెడ నుంచి సిరిసిల్ల వరకు హైవే అలైన్​మెంట్​మార్పుకు మూడు ప్రత్యామ్నాయ మార్గాలను ప్రతిపాదించారు. మొదటిది దుద్దెడ నుంచి రాజీవ్ రహదారి  మీదుగా సిద్దిపేట బ్లాక్ ఆఫీస్ చౌరస్తా వరకు హైవేను డెవలప్​చేస్తూ ఎల్కతుర్తి నుంచి మెదక్ నేషనల్ హైవే 756 డీజీకి కలపడం.  రెండోది రాజీవ్ రహదారి కంటే ముందే వెలికట్ట నుంచి బందారం మీదుగా సిద్దిపేట రీజనల్ రింగ్ రోడ్డు మీదుగా రామంచ వరకు పొడగించడం. 

మూడోది దుద్దెడ నుంచి తుక్కాపూర్, ఘనపూర్ మీదుగా ఇర్కోడ్ వద్ద 765డీజీతో  కలిసి రామంచ వరకు కొనసాగించడం. ఈ మూడు ప్రతిపాదనలపై పూర్తి స్థాయిలో సర్వే జరిపి రైతులకు ఇబ్బంది కలిగించకుండా చూడాలని కలెక్టరేట్​లో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రెండు నెలలు కావస్తున్నా దీనిపై ఎలాంటి ప్రగతి లేకపోవడం గమనార్హం.

అలైన్​మెంట్​మార్పుపై ఆదేశాలు రాలేదు

దుద్దెడ నుంచి సిరిసిల్ల వరకు 365 బీ నేషనల్​హైవే అలైన్​మెంట్​మార్పుపై ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఏడాది కింద అప్రూవలైన​పాత అలైన్​మెంట్​ప్రకారమే హైవే నిర్మాణానికి ప్రతిపాదనలు, ఎస్టిమేషన్లను ఉన్నతాధికారులకు అందజేయనున్నాం. - అన్నయ్య, డీఈఈ, నేషనల్​హైవే 365 బీ