జన భాగస్వామ్యంతో 112 జిల్లాల ప్రగతి గాథ

అభివృద్ధికి సంబంధించి అత్యంత క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటున్న దేశంలోని 112 జిల్లాల కోసం కేంద్ర ప్రభుత్వం “యాస్పిరేషనల్​​ డిస్ట్రిక్ట్స్​ ప్రోగ్రామ్(ఏడీపీ)’’కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆరోగ్యం–-పోషకాహారం, విద్య, వ్యవసాయం–-జలవనరులు, కనీస సౌలతులు, నైపుణ్యాభివృద్ధి సహా ఆర్థిక పురోగతికి ప్రాధాన్యం ఇచ్చింది. యాస్పిరేషనల్​​డిస్ట్రిక్ట్స్​ ప్రోగ్రామ్​ను 2018లో ప్రారంభించగా.. ప్రధానమంత్రే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాల చురుకైన భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వ స్థాయిలో నీతి ఆయోగ్‌‌ దీనికి సారథ్యం వహిస్తోంది. నాగాలాండ్‌‌లోని కైఫీరే నుంచి మణిపూర్‌‌లోని చందేల్‌‌ దాకా; బీహార్‌‌లోని జమూఈ నుంచి రాజస్థాన్‌‌లోని సిరోహి వరకూ ఈ జిల్లాలన్నీ మారుమూల ప్రాంతాల్లో ఉన్నా, సవాళ్లను అధిగమిస్తూ తమ విజయగాథను తామే రచించుకునేలా పురోగమిస్తున్నాయి. ‘సంఘీభావం, సహకారం, పోటీతత్వం’ అనే మూడు స్తంభాల ఆధారంగా ఈ జిల్లాలు ముందడుగు వేస్తున్నాయి. తదనుగుణంగా ఈ కార్యక్రమం ఒక అద్భుత ప్రగతిగాథను రచించింది. 27 రాష్ట్రాల పరిధిలోని 14 శాతం జనాభా భాగస్వామ్యంతో ఇదో ఉత్తేజకర ‘ప్రజా ఉద్యమం’గా మారింది.

చందౌలి నల్ల బియ్యం.. గ్రాండ్​ సక్సెస్
కొన్ని సందర్భాల్లో జనాల్లోనే కాదు దేశాల్లోనైనా ఏకాభిప్రాయానికి తేవడంలో చక్కని ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. నిరుటి శీతాకాలంలో ఒక ఆహ్లాదకర సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఉత్తరప్రదేశ్‌‌లోని చిన్న జిల్లా చందౌలిలో పండించే నల్ల బియ్యంతో చేసిన ఆహారం ఓమన్‌‌, ఖతార్‌‌ దేశవాసుల డైనింగ్​ టేబుళ్లపై దర్శనమిచ్చింది. యాస్పిరేషనల్​​డిస్ట్రిక్ట్స్​ ప్రోగ్రామ్​ కింద దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 112 జిల్లాల్లో చందౌలీ కూడా ఒకటి. ‘పూర్వాంచల్‌‌ ధాన్యాగారం’గా ఈ జిల్లా ప్రసిద్ధికెక్కింది. ఈ ప్రాంతానికి వరి సాగులో ఎంతో పేరున్నందున ఎలాంటి ఎరువులూ వాడకుండా సేంద్రియ పద్ధతుల్లో నల్ల బియ్యం సాగుకు రైతులను ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల్లో వైవిధ్యం సాధించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఈ ప్రయోగం గ్రాండ్​ సక్సెస్​ అవ్వగా, ప్రపంచ విపణిలో నల్ల బియ్యానికి గిరాకీ పెంచడం ద్వారా చందౌలీ అగ్రస్థానంలో నిలిచింది. ఆ మేరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌‌ దేశాలకూ నల్ల బియ్యాన్ని ఎగుమతి చేయడం మొదలైంది. యాస్పిరేషనల్​​డిస్ట్రిక్ట్స్​ ప్రోగ్రామ్​ కింద చందౌలి నల్ల బియ్యం ప్రయోగం తరహాలోనే అనేక ఇతర పద్ధతులు కార్యరూపం ధరించగా, విజయగాథలు ఆవిష్కృతమయ్యాయి.

ప్రోగ్రామ్​ రూట్​ ప్లాన్​కు ప్రశంసలు
ఈ ప్రోగ్రామ్​ అమలుకు నిర్దేశించిన రూట్​ ప్లాన్​కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రశంసలు లభించాయి. ఇందులో భాగంగా యునైటెడ్​ నేషన్స్​ ప్రగతి కార్యక్రమాల విభాగం(యూఎన్‌‌డీపీ) 2021 జూన్‌‌లో “యాస్పిరేషనల్​​డిస్ట్రిక్ట్స్​ ప్రోగ్రామ్: ఒక సమీక్ష” పేరుతో స్వతంత్ర నివేదికను విడుదల చేసింది. స్థానిక పాలకమండళ్ల నిర్మాణాన్ని, అధికార యంత్రాంగాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఈ ప్రోగ్రామ్​ ఒక అంతర్జాతీయ ఉదాహరణగా నిలిచిందని కొనియాడింది. సుస్థిర ప్రగతి లక్ష్యాలను స్థానిక స్థాయిలో నిర్దేశించుకుని బహుళ సభ్యుల భాగస్వామ్యంతో వాటిని సాకారం చేసుకోవడాన్ని ప్రశంసించింది. ఈ ప్రోగ్రామ్​ ఇండియాలో మాత్రమేగాక ప్రపంచ స్థాయిలో స్ఫూర్తిగా తీసుకుని అనుసరించాల్సినదని అభివర్ణించింది. అయితే, ఈ ప్రోగ్రామ్​ సక్సెస్​పై ఇదే తొలి అంతర్జాతీయ గుర్తింపు కాదు. ‘యాస్పిరేషనల్​ డిస్ట్రిక్ట్స్​ ప్రోగ్రామ్ పై ఒక అంచనా’ పేరిట 2020 సెప్టెంబర్​లోనే ‘ఇనిస్టిట్యూట్‌‌ ఫర్‌‌ కాంపిటీటివ్‌‌నెస్‌‌’ సంస్థ ఒక నివేదికను ప్రకటించింది. దీనికి ప్రసిద్ధ హార్వర్డ్‌‌ బిజినెస్ స్కూల్‌‌  ప్రొఫెసర్‌‌ మైకేల్‌‌ ఇ.పోర్టర్‌‌, ఎంఐటీ ప్రొఫెసర్‌‌ స్కాట్‌‌ స్టెర్న్‌‌ ముందుమాట రాశారు. ప్రతి జిల్లాలోనూ అన్ని స్థాయిల ప్రభుత్వ యంత్రాంగాల చురుకైన సహకారం, ప్రభుత్వ–-ప్రైవేట్‌‌ భాగస్వామ్యంతో కార్యక్రమం సాగడం బాగుందని వారు పేర్కొన్నారు. ఫలితాల ఆధారిత పద్ధతులు, సమాచారం తోడ్పాటు చోదకాలుగా భాగస్వామ్య ప్రాధాన్య విధానం అత్యుత్తమమని పై రెండు సంస్థలూ ప్రశంసించాయి.

పోటీతత్వంతో రగిలిన స్ఫూర్తి
యూఎన్‌‌డీపీ అంచనాలు పూర్తి పరిమాణాత్మక, ప్రమాణాత్మక ఉత్తేజకర పద్ధతుల్లో నిర్వహించిన పరిశోధనల మేరకు రూపొందించినవి. ఇందులో భాగంగా జిల్లా మేజిస్ట్రేట్‌‌లు, కలెక్టర్లతోనేగాక ఇన్‌‌చార్జి అధికారులు, విజ్ఞాన/ప్రగతి భాగస్వాములు, ప్రగతికాముక జిల్లాల సభ్యులతో క్షేత్రస్థాయి ఇంటర్వ్యూలు వంటివి ఈ పరిశోధనకు మూలస్తంభాలు. మరింత విశ్లేషణ కోసం ఏడీపీ పరిధిలో లేని జిల్లాల కలెక్టర్లు, జిల్లా మేజిస్ట్రేట్లతోనూ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇక మూలాల స్థాయిలో అధికశాతం యువజనం, భాగస్వాములందరి ప్రోత్సాహంతో కింది స్థాయి నుంచి పైస్థాయి దాకా సహకార స్ఫూర్తితో ప్రణాళికలను అమలు చేశారు. అందరి సహకారంతో మౌలికాంశాల అమలు, అందరినీ సమన్వయం చేయడం ద్వారా వేగంగా ఫలితాల సాధనకు వీలు కలిగింది. ఆయా జిల్లాల్లో ప్రధానంగా ‘చాంపియన్స్‌‌ ఆఫ్‌‌ ఛేంజ్‌‌’ పేరిట తక్షణ ప్రగతి కార్యక్రమంపై దృష్టి సారించిన 5 రంగాల్లో 49 సూచీలపై ప్రత్యక్ష పర్యవేక్షణ అమలు చేశారు. తద్వారా ప్రతి నెలలోనూ అత్యుత్తమ పనితీరు కనబరచిన జిల్లాలకు ర్యాంకులు ఇచ్చారు. ఈ ప్రక్రియతో పోటీతత్వంతో కూడిన ఉత్సాహం మొదలైంది. తద్వారా ఆయా జిల్లాలు అభివృద్ధి పథంలో తమలో తాము పోటీపడేలా స్ఫూర్తి లభించింది. యూఎన్‌‌డీపీ అంచనాలు ఈ సూచీల ప్రాముఖ్యాన్ని, ఉత్తేజకరమైన విజయగాథలను, వీటిద్వారా దేశవ్యాప్తంగా వెల్లివిరిసిన ఉత్సాహాన్ని, ఉత్తమ పద్ధతులను ముందుకు తెచ్చాయి.

ఈ ప్రోగ్రామ్​ దేశ రూపురేఖలను మార్చింది
మొత్తం మీద సాధికార దార్శనికతతో కూడిన మన ప్రధాని పర్యవేక్షణలో ‘యాస్పిరేషనల్​ డిస్ట్రిక్ట్స్​ ప్రోగ్రామ్’ విశేష విజయం సాధించడం జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి యంత్రాంగాల సమష్టి కృషికి తిరుగులేని నిదర్శనం. అయితే, విజ్ఞానరంగ-అభివృద్ధి భాగస్వాములు సహా పౌర సంఘాల నిరంతర మద్దతు లేనిదే ఈ జిల్లాల ప్రగతి గాథ సాకారమయ్యేది కాదనడంలో సందేహం లేదు. భారత ప్రగతి గాథ రూపురేఖలను ఈ భారీ కార్యక్రమం పూర్తిగా మార్చింది. ఆ మేరకు ఒకదాని తర్వాత మరొకటిగా మైలురాళ్లను దాటేకొద్దీ ఇది మరింతగా ప్రశంసలు చూరగొంటుంది.

మెరుగైన సౌలతులు
ఈ జిల్లాల్లో అనేకం భౌగోళికంగా అనువైనవి కానందువల్ల ముందుగా వాటి అనుసంధానం మెరుగు దిశగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చారు. నక్సల్​ ప్రభావిత జిల్లాలు అంతర్గత భద్రత కోసం ఈ పారామీటర్​ను సద్వినియోగం చేసుకున్నాయి. ఉదాహరణకు చత్తీస్‌‌గఢ్‌‌లోని బీజాపూర్‌‌, ఒడిశాలోని మల్కన్​గిరి జిల్లాల్లో రహదారుల నెట్‌‌వర్క్‌‌ గణనీయంగా మెరుగుపడింది. దీంతో వాటి పరిధిలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పెరిగాయి.

నైపుణ్యాభివృద్ధికి ఊతం
నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక సార్వజనీనత స్తంభానికి మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఒక అద్భుత ఉదాహరణగా నిలిచింది. జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సహాయం దిశగా సూక్ష్మ ‘ఏటీఎం’లు ప్రారంభమయ్యాయి. వీటిద్వారా నిర్వహించే ప్రతి లావాదేవీపైనా వారికి కొంత కమీషన్‌‌ లభిస్తుంది. ఇంటర్నెట్‌‌ సదుపాయం బలహీనంగా ఉన్నప్పటికీ ఈ ఏటీఎంలు పనిచేస్తాయి. వీటి ద్వారా డబ్బు తీసుకోవడమే కాకుండా మొబైల్‌‌ ఫోన్లను రీచార్జ్​ చేసుకోవచ్చు. బిల్లులు కూడా చెల్లించవచ్చు.

పోషణ్​ యాప్​ తీసుకొచ్చిన్రు
ఆరోగ్యం-–పోషకాహారం కింద ఆయా జిల్లాల్లో మహిళలు, పిల్లలకు తక్షణ ప్రయోజనాలు అందించడానికి ఆదర్శ అంగన్‌‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆస్పత్రుల్లో చంటిబిడ్డల జననాలు పెరిగాయి. అలాగే శిశువుల్లో తీవ్ర పోషకాహార లోపం శాతం కూడా గణనీయంగా తగ్గింది. చిన్నపిల్లల ఎత్తు, బరువు వివరాల నమోదు పద్ధతులు ప్రమాణీకరించారు. ఆరోగ్యం, పోషకాహార కార్యక్రమం ఫలితాల అన్వేషణకు నిర్ణయించిన ప్రమాణాలు అందుకోవడం సాధ్యమైందని జార్ఖండ్‌‌లోని రాంచీ జిల్లా ‘పోషణ్‌‌’ పేరిట యాప్‌‌ రూపొందించడం ఇందుకు నిదర్శనం. ఆయా జిల్లాల్లోని పోషకాహార చికిత్స కేంద్రాలను, ఆస్పత్రుల్లో ఖాళీ పడకల సమాచారం, పిల్లల ఎదుగుదల చార్ట్​లు, పోషకాహార లోపాలపై ప్రత్యక్ష విశ్లేషణను ఈ డిజిటల్‌‌ వేదిక గుర్తిస్తుంది. ఈ యాప్‌‌ తో ఆస్పత్రుల్లో పడకల నమోదు 90 శాతం దాకా పెరిగింది.

హమారా విద్యాలయ్​ విధానం వచ్చింది
విద్యారంగానికి సంబంధించి ఈ జిల్లాల్లో ఫలితాలు మెరుగుపడ్డాయి. ఆ మేరకు విద్యారంగంలో వినూత్న ఆవిష్కరణలు, డిజిటలైజేషన్‌‌ మూలస్తంభాలుగా నిలిచాయి. తమ విద్యావసరాలకు తగినట్లు ఆయా జిల్లాలు పరిష్కారాలను రూపొందించుకోగలిగాయి. అరుణాచల్‌‌ ప్రదేశ్‌‌లోని మారుమూల జిల్లా నామ్‌‌సాయిలో “హమారా విద్యాలయ్‌‌” పేరిట ఒక కొత్త విధానాన్ని అనుసరించడం ఇందుకు ఒక అద్భుత నిదర్శనం. ఈ నమూనాకు అనుగుణంగా జిల్లాలోని ప్రతి స్కూల్​లో పర్యవేక్షణ, మూల్యాంకనం, మార్గనిర్దేశం కోసం ఇన్‌‌చార్జిని నియమించారు. ఈ కార్యక్రమం కోసం సాంకేతిక భాగస్వామిగా ఉన్న ‘ఎక్కోవేషన్‌‌’ సంస్థ “యథాసర్వం” పేరిట ఒక ఆన్‌‌లైన్‌‌ వేదికను  ఏర్పాటు చేసింది. ఆయా స్కూళ్ల నుంచి ప్రతిస్పందనల నమోదు కోసం దీన్ని ఒక మొబైల్‌‌ యాప్‌‌తో అనుసంధానించారు. నామ్‌‌సాయి జిల్లాలో ఈ వినూత్న కృషి ఫలితంగా బోధన పద్ధతులు, అభ్యసన ఫలితాల్లో ఆ జిల్లా సరికొత్త రికార్డులు నమోదు చేసింది.

స్థానిక ఉత్పత్తుల అమ్మకానికి ప్రాధాన్యం
చందౌలి సమితిలో నల్ల బియ్యం ప్రయోగంతో ఏడీపీ కింద వ్యవసాయం-నీటి వనరుల రంగానికి ఊపు లభించినట్లు స్పష్టమైంది. ఆ మేరకు సాగునీటి సదుపాయాలు, దిగుబడుల మెరుగుకే కాకుండా రైతుల్లో విద్యాభివృద్ధికీ జిల్లా యంత్రాంగాలు ప్రాధాన్యం ఇచ్చాయి. అలాగే ఈ జిల్లాల్లో స్థానిక ఉత్పత్తుల విక్రయం కోసం మార్కెట్ల అనుసంధాన కల్పనకూ వినూత్న మార్గాన్వేషణ చేశారు. ఇందులో భాగంగా అస్సాంలోని గోపాల్‌‌పడా జిల్లా పరిధిలో ‘గోల్‌‌మార్ట్‌‌’ పేరిట ఒక ఆన్‌‌లైన్‌‌ ఈ-–కామర్స్‌‌ పోర్టల్‌‌ ప్రారంభించారు. ఇక్కడ స్థానికంగా పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు దాని ద్వారా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌‌ అందుబాటులోకి వచ్చింది.