- జిల్లా అధ్యక్షుడిని ప్రకటించిన
- రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి
- ఫణి కుమార్ ను అధ్యక్షుడిగా వ్యతిరేకించిన నారాయణరెడ్డి
నల్గొండ అర్బన్, వెలుగు : ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ జిల్లా అధ్యక్షుడి ఎన్నికలు బాహాబాహీగా ముగిశాయి. ఆదివారం నల్గొండలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ లో పీఆర్టీయూ టీఎస్ జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడిగా డీవీఎస్ ఫణికుమార్ ను రాష్ట్ర అధ్యక్షుడు పింగళి శ్రీపాల్ రెడ్డి ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఫణికుమార్ ఎన్నికను పీఆర్టీయూ పూర్వపు కార్యదర్శి కళం నారాయణరెడ్డి వ్యతిరేకించారు.
దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. జిల్లా అధ్యక్షుడిని మార్చాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ అన్ని మండలాల అధ్యక్ష, కార్యదర్శుల అభిప్రాయం మేరకే జిల్లా అధ్యక్ష, కార్యదర్శులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. నూతన జిల్లా అధ్యక్షుడిగా డీవీఎస్ ఫణికుమార్, కార్యదర్శిగా మేకల జానారెడ్డి, అసోసియట్ అధ్యక్షుడిగా తరాల పరమేశ్ యాదవ్, కిరణ్ కుమార్, గౌరవాధ్యక్షులుగా శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.